అగమ్యగోచరం (కృష్ణాజిల్లా)
మచిలీపట్నం, జనవరి 10 బియ్యం మిల్లర్లు, ఎఫ్‌సీఐ మధ్య నెలకొన్న సమస్యతో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దళారుల ప్రమేయం లేకుండా చూడాలన్న లక్ష్యం మేరకు ప్రభుత్వం విధించిన షరతులతో ఆరుగాలం పండించిన పంట విక్రయాల విషయంలో ఇప్పటికే అగచాట్లు పడుతున్నారు. ఇది చాలదన్నట్టు ఎఫ్‌సీఐ, మిల్లర్ల మధ్య వివాదంతో ధాన్యం కొనుగోళ్లు కూడా నిలిచిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయమయ్యింది. పాత బకాయిల పేరుతో మిల్లర్ల నుంచి ఎఫ్‌సీఐ ధాన్యం తీసుకోవడానికి నిరాకరిస్తోంది. జిల్లాలో ఇప్పటికే విక్రయించిన ధాన్యం నగదు రూ.138 కోట్ల కోసం రైతులు ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2.36 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. 14 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు చెప్పినట్టుగానే ఎకరానికి 35 బస్తాల నుంచి 40 బస్తాల దిగుబడులు వస్తున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోళ్ల వ్యవహారంలో లొసుగులు ఉండకూడదన్న లక్ష్యంతో మండలం యూనిట్‌గా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిబంధనల కారణంగా తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొటున్నామని సడలించాలని రైతు ప్రతినిధులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం కనిపించలేదు. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు కేవలం 1.53లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. అధికారుల అంచనాల ప్రకారం ఇంకా 12 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనాలి. ఇంత భారీ లక్ష్యం ఉన్నా గడిచిన కొన్ని రోజులుగా కొనుగోళ్లు నిలిపోవడంతో రైతులకు ఏంచేయాలో పాలుపోవడంలేదు. అన్నదాతలు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు విక్రయిస్తే వాటిని ప్రభుత్వం మిల్లర్లకు అందజేస్తుంది. మిల్లర్లు వాటిని మరపట్టించి ఎఫ్‌సీఐకి తరలించాలి. ప్రస్తుతం మిల్లర్ల నుంచి బియ్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోకపోవడం కొనుగోళ్లు నిలిచిపోవడానికి కారణమయ్యింది. 2009లో పలు మిల్లుల యజమానులు ఎఫ్‌సీఐకు బకాయిలు పడ్డారు. అలా ఒక్కో మిల్లు యజమాని రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బియ్యాన్ని తీసుకోవాలంటే. బకాయిలు వెంటనే చెల్లించాలని ఎఫ్‌సీఐ మిల్లర్లకు స్పష్టం చేసింది. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని బియ్యం ఆడించిన తరువాత 15 రోజుల్లో ఎఫ్‌సీఐ గోదాములకు తరలించాలి. ప్రస్తుతం తీసుకోక పోవడంతో ధాన్యాన్ని మరపట్టించకుండా నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా 218 మిల్లులు ఉంటే వాటిలో కేవలం 20 శాతానికి మాత్రమే బకాయిలు లేవు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకునేందుకు మిల్లర్లు ప్రభుత్వానికి పూచీకత్తుగా బ్యాంకు గ్యారంటీ ఇస్తారు. ఒక్కో మిల్లు సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వం ఎంత ధాన్యం కేటాయిస్తుందో అంత మొత్తానికి సరిపడా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుది. అలా ఒక్కో మిల్లు రూ.50లక్షల నుంచి రూ.6 కోట్ల వరకు ప్రభుత్వానికి బ్యాంకు గ్యారంటీ ఇస్తుంది. ప్రస్తుతం ఆయా మిల్లులు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీకి సరిపోను ధాన్యాన్ని ప్రభుత్వం ఇప్పటికే అప్పగించింది. మిల్లర్ల నుంచి ఎఫ్‌సీఐ బియ్యాన్ని తీసుకోకపోవడంతో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి.