తలనొప్పిగా మారిన మహారాష్ట్ర మంత్రివర్గం
ముంబై, జనవరి 10
మహారాష్ట్రలో పదవుల పందేరం తలనొప్పిని తెచ్చే పెట్టేదిలా తయారయింది. ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టడం, వారికి శాఖలను కేటాయించడంలోనే తీవ్ర సమయం తీసుకున్నారు. మూడు పార్టీల నేతలతో సంప్రదించి మంత్రివర్గంలో కొందరికి స్థానం కల్పించినా వారికి శాఖల కేటాయింపులో మాత్రం సంతృప్తి పర్చలేకపోయారు. శివసేన, ఎన్సీపీలు మాత్రమే కీలక పదవులు వరించాయి.మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ లో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా కీలకంగా ఉంది. కాంగ్రెస్ లో అసంతృప్తులు తలెత్తితే అంత తేలిగ్గా పరిష్కారం కావన్నది తెలిసిందే. ఇందుకు ఉదాహరణ కర్ణాటక రాజకీయమే. కర్ణాటకలో కాంగ్రెస్ లో తలెత్తిన అసంతృప్తి చివరకు అధికారం నుంచి దూరం చేయగలిగింది. కర్ణాటక రాజకీయ సంక్షోభం నుంచి కాంగ్రెస్ అధిష్టానం పాఠాలు నేర్చుకోలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది.మంత్రి వర్గవిస్తరణ జరిగి వారికి శాఖల కేటాయింపులో అధిష్టానం జోక్యం చేసుకోలేదన్నది మహారాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి విన్పిస్తున్న విమర్శ. అంతా శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రేలకే వదిలేశారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలో మంత్రిపదవులు కేటాయించిన తర్వాత పరిణామాలను చూస్తే ఇదే అర్థమవుతుంది. ఒక్క రెవెన్యూ శాఖ తప్పించి కాంగ్రెస్ కు ముఖ్యమైన శాఖలు దక్కలేదు.దీంతో అనేక మంది మంత్రిపదవులు దక్కిన కాంగ్రెస్ నేతలు సయితం తమ అసంతృప్తిని బాహాటంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేత విజయ్ వడెట్టివర్ కు భూకంప, సాయం, పునరావాసం శాఖ దక్కింది. దీంతో ఆయన ఈ శాఖను తీసుకోవాలా? లేదా? అని ఆలోచిస్తున్నారు. మరో మంత్రి అమిత్ దేశ్ ముఖ్్ సయితం మెడికల్ విద్య, సాంస్కృతిక వ్యవహారాల శాఖను కేటాయించినా సంతృప్తిగా లేరు. మరికొందరు కాంగ్రెస్ నేతలదీ అదే పరిస్థితి. కాంగ్రెస్ హైకమాండ్ ను కలసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయాలని కాంగ్రెస్ మంత్రులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అహ్మద్ పటేల్ సోనియాను కలసి మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిపారు. మరి ఈ అసంతృప్తి ఎంతవరకూ దారితీస్తుందోనన్న ఆందోళన కూటమి పార్టీలో ఉంది.