పెద్ద చర్చకు దారి తీసిన నిర్భంధ కేంద్రాలు
న్యూఢిల్లీ, జనవరి 10
నిర్బంధ కేంద్రాలు… ఇప్పుుడ కొత్తగా వినిపిస్తున్న మాట. వాస్తవానికి ఇది కొత్త విషయమేమీ కాదు. పాత అంశమే. గతంలోనూ వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి నిర్బంధ కేంద్రాలున్నాయి. తాజాగా అసోంలో అక్రమ వలసదారులు, జాతీయ పౌర పట్టిక పై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగు తుండటం తో నిర్బంధ కేంద్రాల అంశం వెలుగులోకి వచ్చింది. ఈ దేశ పౌరులు కాని వారిని, అక్రమ వలసదారులను, వీసా గడువు ముగిసినా సొంత దేశాలకు వెళ్లని వారిని ఈ నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతారు. ఇవేమీ జైళ్లు కావు. అందులో ఉన్నవారు నిందితులు కారు. పౌరులుగా ఉండటానికి అర్హత లేని వారిని ఈ కేంద్రాల్లో ఉంచుతారు. ఇక్కడ వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఎలాంటి నిర్బంధాలు ఉండవు. దండనలు ఉండవు. తాజాగా అసోంలో సుమారు 19 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు ఎన్ఆర్సీ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో శరవేగంగా నిర్బంధ కేంద్రాలను నిర్మిస్తున్నారు. ఈ అక్రమ వలసదారులను అక్కడ ఉంచుతారని భావిస్తున్నారు. రాష్ట్రంలోని గోల్ పాడాజిల్లా మాతియాలో సుమారు 2 హెక్టార్ల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. రూ.46 కోట్లు ఇందుకోసం వెచ్చిస్తున్నారు. నిర్బంధ కేంద్రాల చుట్టూ 20 అడుగుల ఎత్తులో గోడ నిర్మిస్తున్నారు. ఈ కేంద్రంలో ఉండే అక్రమ వలసదారులు పారిపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరి కదలికలను అనుక్షణం గమనించేందుకు వీలుగా వాచ్ టవర్లను కూడా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రాధమిక సౌకర్యాలన్నీ ఉంటాయి. ప్రాధమిక పాఠశాల, వైద్యశాల, ఆడిటోరియం, వంటశాలను నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేయాలని భావించినా పనుల్లో జాప్యం కారణంగా నిర్మాణం పూర్తి చేయడానికి మార్చి 31వ తేదీ వరకూ గడువు పొడిగించారు. ఇందులో కనీసం మూడువేల మంది నివసించవచ్చని అంచనా. మహిళలకు, పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. అసోం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నిర్బంధ కేంద్రాల నిర్మాణ పనుల్లో నిమగ్నమయింది. రాజధాని గౌహతి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ నిర్బంధ కేంద్రం ఉంది. నిర్బంధ కేంద్రాల్ని నిర్దేశిత మార్చి 31వ తేదీలోగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర ఆర్థిక మంత్రి హేమంత బిశ్వశర్మ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అసోంలో నిర్మిస్తున్న ఈ నిర్బంధ కేంద్రం దేశంలోనే తొలి కేంద్రమన్న ప్రచారం ఉంది. కానీ ఇది వాస్తవం కాదు. గత రెండు మూడు దశాబ్దాలుగా అక్రమ వలసల అంశం చర్చకు రాకపోవడంతో నిర్బంధ కేంద్రాల విషయం కూడా వెలుగులోకి రాలేదు. చట్టాలకు అనుగుణంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు దీనిని నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. 1920 నాటి పాస్ పోర్ట్, 1946 నాటి విదేశీ చట్టం ప్రకారం చెల్లుబాటు కాని వీసాతో పాటు, గడువు ముగిసినా దేశంలో అక్రమంగా నివసిస్తున్న, జైలు శిక్ష ముగిసిన విదేశీయులను ఇక్కడ ఉంచుతారు. వారు తమ స్వదేశాలకు వెళ్లేందుకు అవసరమైన పత్రాలు పొందేవరకూ ఇక్కడ వసతి కల్పిస్తారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ 1998 జులైలో రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇచ్చింది. 2009 నవంబరు 23న, 2012 మార్చి 7న, 2014 ఏప్రిల్ 29న, 2014 సెప్టెంబరు 10న, 2018 సెప్టంబరు 7న ఈ మార్గదర్శకాలను కేంద్రం పునరుద్ధరించింది. అన్ని రాష్ట్రాల్లో ఈ నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని 2018 సెప్టంబరులో సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా ఆదేశించింది. నిర్బంధ కేంద్రాలకు సంబంధించిన నమూనాలను 2019 జనవరి 9న కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది.దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్బంధ కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ప్రధానంగా ఇవి దేశ సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. అసోంలోని కోక్రాఝర్, తేజ్ పూర్, జోర్హాట్, దబ్రూగఢ్, సిల్బార్ ల్లో ఇవి పనిచేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ నిర్బంధ కేేంద్రాలు ఉన్నాయి. మహిళలకు కూడా ప్రత్యేక కేంద్రం పనిచేస్తుంది. బంగ్లా దేశీయుల కోసం ఢిల్లీలోని షాజాద్ బాగ్ లో ఏర్పాటు చేశారు. పంజాబ్ లోని అమృత్ సర్, రాజస్థాన్ లోని ఆల్వాల్, గుజరాత్ లోని భుజ్, తమిళనాడులోనూ ఈ నిర్బంధ కేంద్రాలు పనిచేస్తున్నాయి. 1948, 1992 చట్టాల ప్రకారం ఆయా జిల్లాల ఎస్పీలు విదేశీ రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్ కత్తా, అమృత్ సర్, బెంగళూరు, హైదరాబాద్, కోచి, తిరువనంతపురం, కోజికోడ్, లక్నో, అహ్మదాబాద్ నగరాల్లో విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ అధికారులను నియమించారు. నిర్బంధ కేంద్రాలను చట్టబద్దంగా ఏర్పాటు చేసినవే. అక్రమం కానే కాదు. అన్నీ సక్రమమే. అక్రమ వలసదారులను, అక్రమంగా నివసించే విదేశీయులను కట్టడి చేసేందుకు ఈ నిర్బంధ కేంద్రాలు కొంతవరకైనా దోహద పడతాయి.