ముగ్గురికి ప్రతిష్టాత్మకం
హైద్రాబాద్, జనవరి 10,
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ముగ్గురి నేతల రాజకీయ భవిష్యత్తును ఆ పార్టీ నిర్దేశించనుంది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటితేనే ఈ ముగ్గురు నేతలకు పార్టీలో తగిన గౌరవం, గుర్తింపు లభిస్తుంది. లేకుంటే వేల మందిలో ఒకరుగా మిగిలిపోక తప్పదు. ముగ్గురూ వేర్వేరు పార్టీల నుంచి వచ్చిన నేతల కావడంతో మున్సిపల్ ఎన్నికల్లో వీరిపై ఫోకస్ ఎక్కువగా ఉంది. వారే డీకే అరణ, మాజీ ఎంపీ వివేక్, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు.డీకే అరుణ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరగా, వివేక్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఇక గరికపాటి మోహన్ రావు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ బీజేపీ కండువా కప్పేసుకున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో డీకే అరుణ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ ముగ్గురికి మూడు ప్రాంతాలు అప్పగించారు. వాటికి ఇన్ ఛార్జిలుగా నియమించారు. ఈ మూడు ప్రాంతాల్లో గెలుపోటములకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.డీకే అరుణకు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఈ పరిధిలో కోస్గి, కొడంగల్, నారాయణపేట, బోధ్ పూర్, మక్తల్, అమరచింత, ఆత్మకూరు, షాద్ నగర్, కొత్తకోట, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ గెలుపోటములను బట్టే డీకే అరుణకు పార్టీలో పదవి దక్కే అవకాశముంది. ఇక మాజీ ఎంపీ వివేక్ కు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, బెల్లంపల్లి, మంచిర్యాల, సుల్తానాబాద్, నన్పూర్, చెన్నూరు, క్యాథనపల్లి, లక్షణ్ పేట్ మున్సిపాలిటీల బాధ్యతలను అప్పగించారు.రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావుకు నల్లొండ పార్లమెంటు పరిధిలోని మిర్యాలగూడ, సూర్యాపటే, దేవరకొండ, హుజూర్ నగర్, నల్లగొండ, కోదాడ, నేరేడు చర్ల, చిట్యాల, హాలియా మున్సిపల్ కార్పొరేషన్లలో గెలుపోటముల బాధ్యతను బీజేపీ అధిష్టానం అప్పగించింది. ఈ ముగ్గురు ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ వారికి అప్పగించిన పరిధిలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ ముగ్గురు నేతలు వేర్వేరు పార్టీల నుంచి వచ్చినా తమకు, తమ అనుచరులకు పదవులు కోసం పట్టుబడుతున్నారు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తేనే బీజేపీ అధిష్టానం వారివైపు చూస్తుంది. లేకుంటే పక్కన పెట్టేది ఖాయమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.