సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం జగన్
హైదరాబాద్ జనవరి 10
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో సీఎం హోదాలో జగన్ తొలిసారిగా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, మాజీ ఐఏఎస్ శామ్యూల్ లు హాజరయ్యారు. గత ఏడాది మార్చి 1న చివరిసారిగా ఆయన న్యాయస్థానంలో హాజరయ్యారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. గెలిచి ఆయన సీఎం కావడంతో అప్పటి నుంచి ప్రతి వారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వచ్చాయి. కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలన్న జగన్ విజ్ఞప్తిని సిబిఐ కోర్టు తిరస్కరించింది. అయితే పదే పదే కోర్టుకు గైర్హాజరుకావడంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదనరావు గత వారంతీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తదుపరి విచారణకు ఆయన, రెండో నిందితుడైన వైసీపీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పనిసరిగా హాజరుకావాలని...లేదంటే తగు ఉత్తర్వులు జారీ చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్, విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. శుక్రవారం విచారణ ముగిసిన తరువాత ఈ నెల 17 కు కేసు వాయిదా వేసారు న్యాయమూర్తి. జగన్ రాక సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.