హైవేలపై ఇక పోలీసుల నిరంతరం నిఘా
హైదరాబాద్ జనవరి 10
దిశ ఘటన జరిగిన తరువాత హైవేలపై భద్రత ప్రశ్నార్థకంగా మారిన సమయంలో పోలీసులు దాని పై చర్యలు చేపట్టారు.దిశ ఘటన కి ప్రధాన కారణం హైవే పైన గస్తీ లేకపోవడమే అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపశ్యం లో పోలీసులు హైవేలపై నిరంతరం నిఘా ఉంచే ఉద్దేశంతో పెట్రోలింగ్ వాహనాలను ప్రవేశపెట్టారు. శంషాబాద్ నుంచి షాద్నగర్ వరకు పెట్రోలింగ్ కోసం 4 పోలీస్ వాహనాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రారంభించారు.ఈ నాలుగు పెట్రోలింగ్ వాహనాలతో శంషాబాద్ నుంచి షాద్ నగర్ మార్గంలో 24 గంటల గస్తీ తిరుగుతాయి.ఒక్కో వాహనానికి 15 కిలో మీటర్ల పరిధి ఉంటుంది .హైవే పై ప్రమాదాలు జరిగితే తక్షణం స్పందించేందుకు ఇవి తోడ్పడనున్నాయి. క్షతగాత్రులను త్వరగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు కూడా ఇవి ఉపయోగపడనున్నాయి. హైవే పెట్రోలింగ్ నిర్వహించే గస్తీ బృందాలకు కార్పోరేట్ ఆస్పత్రిలో శిక్షణ ఇచ్చారు.మొత్తం 55 కిలోమీటర్ల పరిధిలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు సంచరిస్తుంటాయీ.ప్రమాదాలు అరికట్టే ఉద్దేశంతోనే ఈ వాహనాలను ప్రవేశపెట్టినట్లు సజ్జనార్ చెప్పారు. ఈ పరిధిలో ఎవరికైనా ఆపద వస్తే వెంటనే 100 నెంబరుకు ఫోన్ చేయాలని సీపీ సూచించారు. త్వరలోనే బాలానగర్ మొయినాబాద్ ప్రాంతాల్లోనూ పెట్రోలింగ్ వాహానాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.