బోర్డర్‌ని తలపిస్తున్న రాజధాని గ్రామాలు: నారా లోకేశ్
అమరావతి జనవరి 10
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తరలించొద్దని రైతులు, రైతు కూలీలు గత కొన్నిరోజులుగా ఆందోళన మరింత ఉదృతంగా మారుతుంది. ఈ క్రమంలో పలువురు మహిళా రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వ్యవహారంపై టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజధాని గ్రామాలు బోర్డర్‌ని తలపిస్తున్నాయని.. పాకిస్తాన్ బోర్డర్‌లో కూడా ఇంత మంది పోలీసులు ఉండరని చెప్పుకొచ్చారు. అన్యాయంగా, క్రూరంగా పోలీసు బలంతో ఉద్యమాన్ని అణిచివెయ్యాలని సీఎం వైఎస్ జగన్ యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘వైకాపా ప్రభుత్వం ఎంత అణిచివేస్తే ఉద్యమం అంత ఉగ్రరూపం దాలుస్తుంది. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులను రెచ్చగొట్టే చర్యలు వైకాపా ప్రభుత్వం మానుకోవాలి. అక్కాచెల్లీ అంటూ పాదయాత్రలో పలకరించారు వైఎస్ జగన్ గారు. ఇప్పుడు అదే అక్కాచెల్లీ కంట కన్నీరు పెట్టి రోడ్డెక్కితే ఎందుకు పారిపోతున్నారు? అన్యాయంగా మహిళలపై చేయి చేసుకుంటారా? ఒక్కో ఇంటి దగ్గర పది మంది పోలీసులా? మహిళల్ని అరెస్ట్ చెయ్యడానికి జగన్ గారికి సిగ్గుగా లేదా?’ అని లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇళ్ల ముందు టెంట్ పట్టుకొని పోలీసులు నిలబడతారా? టెంట్ వేసుకొనే హక్కు రైతులకు లేదా? దేశానికి అన్నం పెట్టే రైతు అంటే జగన్ గారికి అంత చులకనా? ఎంత మంది పోలీసులను దింపినా ప్రజాగ్రహాన్ని వైకాపా ప్రభుత్వం చవిచూడక తప్పదు’ అని లోకేశ్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.