మేడారానికి భారీగా చార్జీలు
వరంగల్, జనవరి 10
మేడారం జాతరకు వెళ్లాలనుకొనే భక్తులకు చేదువార్త. ఎందుకంటే, ఈ మార్గంలో టికెట్ ధరలను ఆర్టీసీ బాగా పెంచింది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలిస్తుంటారు. గతేడాది ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాక, టికెట్ ధరలు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మేడారం జాతర టికెట్ల రేట్లు కూడా పెరిగాయి.మేడారం గ్రామం వరంగల్ జిల్లా కేంద్రానికి 110 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈసారి జాతరకు మొత్తం 4 వేల బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో ముఖ్యంగా వరంగల్ రీజియన్ నుంచి అత్యధికంగా 2,250, కరీంనగర్ రీజియన్ నుంచి 600 బస్సులు, ఖమ్మం నుంచి 400, ఆదిలాబాద్ నుంచి 300, నిజామాబాద్ నుంచి 250, హైదరాబాద్ నుంచి 200 బస్సులు జాతర కోసం నడపాలని నిర్ణయించారు. ఒకవేళ రద్దీ ఇంకా పెరిగితే ముందు జాగ్రత్తగా మరిన్ని బస్సులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ జాతర కోసం ఆర్టీసీకి చెందిన 12 వేల మంది సిబ్బంది సేవలు అందించనున్నట్లు అంచనా.హైదరాబాద్ నుంచి మేడారానికి వెళ్లాలంటే ఏసీ బస్సు ఛార్జీ రూ.710కు (పిల్లలకు రూ.540) పెంచారు. సూపర్ లగ్జరీ ఛార్జీ రూ.550 (పిల్లలకు రూ.290), ఎక్స్‌ప్రెస్ ఛార్జీ అయితే రూ.440 (పిల్లలకు రూ.230) వసూలు చేయనున్నారు. 2018 మేడారం జాతరలో ఎక్స్‌ప్రెస్ ఛార్జీ పెద్దలకు రూ.360 ఉండేది. కానీ, ఇప్పుడు రూ.440 చేయడంతో రూ.80 పెరిగింది. ఇక సమీప ప్రాంతాల బస్సుల్లోనూ టికెట్ ధరను సగటున రూ.30 నుంచి 50 వరకు పెంచారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట నుంచి 2018 జాతరలో రూ. 160 స్పెషల్ ధర ఉంటే ఈ సారి 190 రూపాయలకు పెంచారు