YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విదేశీయం

ఉక్రెయిన్ విమానం కూల్చివేత వెనుక ఇరాన్ హస్తం

ఉక్రెయిన్ విమానం కూల్చివేత వెనుక ఇరాన్ హస్తం

ఉక్రెయిన్ విమానం కూల్చివేత వెనుక ఇరాన్ హస్తం
న్యూఢిల్లీ, జనవరి 10 
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వెళ్తున్న ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం బుధవారం తెల్లవారుజామున కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై అగ్ర దేశాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విమానాన్ని ఇరాన్‌కు చెందిన క్షిపణి ఢీకొట్టిందని ఆరోపిస్తున్నాయి. అయితే ఆ సమయంలో విమానాన్ని క్షిపణి ఢీకొట్టినట్లు ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒకదానికొకటి ఢీకొన్న తర్వాతే విమానం కుప్పకూలినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియో బయటకు రావడంతో అగ్ర దేశాల ఆరోపణలకు బలం చేకూరినట్టు అయింది. ఇరాన్‌ను మొత్తానికి ఇరుకున పడింది.క్షిపణి దాడివల్లే తమ విమానం కూలిపోయి ఉంటుందని ఉక్రెయిన్‌ అనుమానం వ్యక్తం చేసింది. ప్రమాదంపై ఏడు కోణాల్లో విచారణ జరుపుతున్నామని పేర్కొన్నది. ఉక్రెయిన్‌ జాతీయ భద్రత సంఘం కార్యదర్శి ఒలెక్సీ డానిలోవ్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విమాన ప్రమాదంపై క్షిపణి దాడి సహా అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. ‘టోర్‌ మిస్సైల్‌ సిస్టమ్‌కు చెందిన క్షిపణి ఢీకొట్టి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. విమానం కూలిపోయిన ప్రాంతానికి సమీపంలో ఈ క్షిపణుల ఆనవాళ్లు దొరికాయని ఇంటర్నెట్‌లో చదివాను’ అని పేర్కొన్నారు. అయితే ఏ వెబ్‌సైట్‌లో చూశారో మాత్రం వెల్లడించలేదు.మరోవైపు ఉక్రెయిన్‌కు చెందిన 45 మంది నిపుణుల బృందం గురువారం ఉదయం టెహ్రాన్‌కు చేరుకున్నదని డానిలోవ్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు జరిపేందుకు ఇరాన్‌ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. వారు బ్లాక్‌ బాక్స్‌లను కూడా పరిశీలిస్తారని చెప్పారు. దీంతోపాటు ఉగ్రవాదులు డ్రోన్‌ లేదా ఎగిరే వస్తువు సాయంతో విమాన ఇంజిన్‌ను ఢీకొట్టి ఉంటారనే కోణంలోనూ ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటనలో వాస్తవాలను వెలికి తీయడమే తమ ప్రధాన లక్ష్యమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.టోర్‌' అనేది రష్యా రూపొందించిన క్షిపణి వ్యవస్థ. 700 మిలియన్‌ డాలర్ల ఒప్పందంలో భాగంగా రష్యా.. 2007లో 29 టోర్‌-ఎం1 క్షిపణులను ఇరాన్‌కు అప్పగించింది. ఇరాన్‌ వీటిని పలుమార్లు తమ సైనిక పరేడ్‌లో ప్రదర్శించింది. ఉక్రెయిన్‌ ఆరోపణలపై ఇరాన్‌ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. అయితే క్షిపణి దాడి వల్లే విమానం కూలిందంటూ మీడియాలో బుధవారం వార్తలు రాగా.. ఇరాన్‌ సైన్యం అధికార ప్రతినిధి జనరల్‌ అబోల్‌ఫజల్‌ షెకార్చి ఖండించారు. ఇరాన్‌ వ్యతిరేక శక్తులు తమపై మానసిక యుద్ధానికి తెరలేపుతున్నారని విమర్శించారు.కుప్పకూలిన ఉక్రెయిన్‌ విమానంలో 136 మంది కెనడాకు వస్తున్నవారేనని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారని తెలిపారు. కెనడాతో సంబంధం ఉన్న విమాన ప్రమాదాల్లో ఇదే అతిపెద్దదని చెప్పారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపాలని కోరారు. మరోవైపు ప్రమాదం నేపథ్యంలో కెనడా పార్లమెంట్‌పై జాతీయ జెండాను అవనతం చేశారు. మృతుల్లో అత్యధికులు కెనడాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులేనని ఓ నివేదిక తెలిపింది. శీతాకాలం సెలవుల అనంతరం వారంతా టొరంటోకు తిరుగు ప్రయాణం అయ్యారని వెల్లడించింది.

Related Posts