మంత్రి సబితా మాజీ మంత్రి ధర్మానకు సీబీఐ కోర్టు సమన్లు
హైదరాబాద్ జనవరి 10
పెన్నా సిమెంట్స్ కేసులో అనుబంధ అభియోగపత్రం విచారణకు నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు స్వీకరించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. అలాగే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, రిటైర్డ్ అధికారులు శామ్యూల్, వీడి రాజగోపాల్, డీఆర్‌వో సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్ ఎల్లమ్మకు సమన్లు జారీ చేస్తూ.. పెన్నా సిమెంట్స్ కేసులో ఈనెల 17న విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.అయితే అనుబంధ చార్జ్‌షీట్‌ను పరిగణించవద్దని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇతర నిందితుల వాదనను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్లలో పలువురు రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు ఉండటంతో ఈ కేసు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నది.కాగా ఏపీ సీఎం జగన్ శుక్రవారం ఉదయం నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు కోర్టుకు హాజరయ్యారు. రెండు గంటల పాటు సీఎం జగన్ కోర్టులోనే ఉన్నారు. సీఎం హోదాలో జగన్ సీబీఐ కోర్టుకు రావడం ఇదే తొలిసారి. అయితే.. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరగా.. ఆ అభ్యర్థనను మరోసారి న్యాయస్థానం తోసిపుచ్చింది.