వరుస వివాదాలు శ్రీదేవి
గుంటూరు, జనవరి 11, )
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ మహిళ ఎమ్మెల్యే తీరు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ఆ పార్టీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా గెలిచి ఏడు నెలలే అయినా వారానికి ఒక వివాదంతో ఆమె వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకు ఆ కాంట్రవర్సీ లేడీ వైసీపీ ఎమ్మెల్యే ఎవరో కాదు గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా ఎన్నికలకు కొద్ది నెలల ముందే తాడికొండ ఇన్‌చార్జ్‌గా నియమితులు అయిన శ్రీదేవి జగన్ వేవ్‌లో సునాయాస విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే ఆమె ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.ఇక గుంటూరు పార్లమెంటు పరిధిలో పోటీ చేసిన మరో నేతతోనూ ఆమెకు ఎన్నికల టైంలోనే విబేధాలు తలెత్తాయన్న మ్యాటర్ అప్పుడే లీక్ అయ్యింది. ఇక నియోజకవర్గంలో క్రషర్ వ్యాపారులు సైతం ఆమెపై ఆరోపణలు చేసినట్టు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇక వినాయక ఉత్సవాల్లో ఆమె కొందరిపై కేసులు పెట్టించడం, చివరకు ఆమె కుల వివాదంలోనే ఓ కీలక అధికారి బదిలీ అయ్యారన్న వార్తలు.. ఇలా చాలా వివాదాస్పద విషయాలకు ఉండవల్లి శ్రీదేవి కేంద్ర బిందువుగా మారుతున్నారు.తాజాగా నియోజకవర్గానికి చెందిన ఓ యువజన నేత పార్టీకి రాజీనామా చేయడంతో పాటు శ్రీదేవిపై తీవ్ర ఆరోపణలు చేయడం పార్టీ వర్గాల్లోనే సంచలనంగా మారింది. నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల భర్తీలో ఉండవల్లి శ్రీదేవి పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడిన వారిని పక్కన పెట్టేసి ఓసీలు, బీసీలు, ఎస్సీలు అంటూ విభజించి మరీ రేట్లు పెట్టి బేరసారాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలు ఇప్పుడు జిల్లా పార్టీలో రగడకు దారి తీశాయి. ఇక ఉండవల్లి శ్రీదేవి ఏడు నెలల కాలంలోనే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు.
తాడికొండ నియోజకవర్గానికే చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో ఉండవల్లి శ్రీదేవికి తీవ్ర విబేధాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం సురేష్ వేలుపెడుతున్నాడంటూ ఆమె అధిష్టానానికి కంప్లెంట్ చేసినట్టు అప్పట్లోనే టాక్ వచ్చింది. సురేష్‌తో ఆమెకు ఇప్పటకీ అదే గ్యాప్ కంటిన్యూ అవుతున్నట్టే ఉంది. ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీతోనూ శ్రీదేవికి పొసగని పరిస్థితి. తాడికొండ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో రజనీపై బహిరంగంగానే ఉండవల్లి శ్రీదేవి రుసరుసలాడినట్టు వార్తలు వచ్చాయి.ఇక నియోజకవర్గంలో ఓ మండల పార్టీ అధ్యక్షుడితో ఆమెకు తీవ్ర విబేధాలు రావడంతో ఆమె ఏకంగా పార్టీ అధిష్టానం పైనే ఆయన్ను తప్పించాలని ఒత్తిడి చేసినట్టు టాక్ ఉండవల్లి శ్రీదేవి తీరుపై సొంత పార్టీలోనే కొందరు ప్రత్యర్థులు అధిష్టానానికి కంప్లైంట్ చేస్తే ఆమె సైతం పార్టీ నేతలపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇక నియోజకవర్గంలో ఇసుక రీచ్‌ల వ్యవహారాల్లోనూ ఆమె పేరు ప్రముఖంగా నానింది. ఇక రాజధాని ప్రాంతంలో జరుగుతోన్న ఆందోళనల నేపథ్యంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమర్థవంతంగా ముందుకు వెళుతుంటే శ్రీదేవి తన నియోజకవర్గంలో జరుగుతోన్న ఆందోళనల విషయంలో ఏం స్పందించడం లేదన్న ఆగ్రహం కూడా నియోజకవర్గ ప్రజల్లో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏడు నెలల్లోనే ఆమెపై అటు ప్రజలు, ఇటు సొంత పార్టీ నేతల్లో వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. మరి ఈ వరుస వివాదాలకు ఉండవల్లి శ్రీదేవి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పెడుతుందో ? చూడాలి