కన్నా యూ టర్న్
గుంటూరు, జనవరి 11,
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట మార్చారు. ఇలా అనడం కంటే కూడా ఆయన కూడా యూటర్న్ తీసుకున్నారని అంటే ఉత్తమం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో మూడు రాజధాను ల ప్రస్తావన వచ్చినప్పటి నుంచి కూడా కన్నా లక్ష్మీనారాయణ తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి.. శంకుస్థాపన చేశారని, కాబట్టి ఇక్కడే రాజధానిని కొనసాగించాలని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు నోటి నుంచి ఏది వస్తే.. దానినే పట్టుకుని కన్నా లక్ష్మీనారాయణ కూడా వేలాడారు. రాజధానిని తరలించే హక్కు ఎవరిచ్చారు? అంటూ జగన్‌పై నిప్పులు చెరిగారు.అంతేకాదు, కేంద్రం చూస్తూ ఊరుకోదని, రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుందని చెప్పారు. అయితే, అదే కేంద్రంలోని బీజేపీ కీలక నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు రంగంలోకి దిగి కేంద్రానికి రాష్ట్ర రాజధానులకు సంబంధం ఉండదని, రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోదని చెప్పారు. అంతేకాదు.. బీజేపీ కీలక నేతగా తాను చెప్పేదే ఫైనల్ అన్నారు అయితే, దీనిపైనా కన్నా లక్ష్మీనారాయణ మళ్లీ రియాక్ట్ అయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తాను చెప్పేదే ఫైనల్ అన్నారు.రాజధానిపై కేంద్రం తప్పకుండా రియాక్ట్ అవుతుందని, జగన్ ఇష్టానుసారం రాజధానులు మారిస్తే.. చూస్తూ ఊరుకోబోదని అన్నారు. కన్నా.. ఆ విధంగా వ్యాఖ్యలు చేశారో లేదో వెంటనే ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో మూడో కంటికి కూడా తెలియకుండా ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చారు. వచ్చీరావడంతో రాజధానిపై ఓ మీడియాతో మాట్లాడుతూ.. యూటర్న్ వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్ణయానికీ కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.అసలు తాను కేంద్రం జోక్యం చేసుకుంటుందని కూడా చెప్పలేదని, తన వ్యాఖ్యలను ఓ వర్గం మీడియా వక్రీకరించిందని చెప్పారు. దీంతో ఢిల్లీలో కన్నా లక్ష్మీనారాయణకు సరైన క్లాస్ ఇచ్చారని, అనవసరంగా బీజేపీ తరపున వ్యాఖ్యలు చేయడం మానుకుని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కన్నా లక్ష్మీనారాయణకు తలంటారని ప్రచారం సాగుతోంది. మరి ఏం జరిగిందో తెలియాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే