వైసీపీ గూటికి బోళ్ల రాజీవ్
ఏలూరు, జనవరి 11,
ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మరో భారీ ఎదురు దెబ్బతగలనుందా ? కీలకమైన యువనాయకుడు పార్టీకి దూరం అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా ? త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారా ? అంటే.. తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. విషయంలోకి వెళ్తే.. పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన ఇద్దరు కీలక రాజకీయ నాయకులు, కేంద్రంలో మంత్రులుగా గతంలో చక్రం తిప్పిన కావూరి సాంబశివరావు, దివంగత బోళ్ల బుల్లి రామయ్యల మనవడు బోళ్ల రాజీవ్. ప్రస్తుతం ఈయన టీడీపీలో ఉన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలకుముందు ఏలూరు ఎంపీగా టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు.ఎన్నికలకు ముందు వరకూ…అయితే ఎన్నికలకు ముందు వరకు ఏలూరు అప్పటి ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు ఉరఫ్ బాబు పోటీ చేసేదీ లేనిదీ తీవ్ర సందిగ్ధంలో ఉండడంతో ఈ టికెట్‌ను రాజీవ్‌కే కేటాయిస్తారని అందరూ అనుకున్నా రు. అయితే, అనూహ్యంగా ఎన్నికలకు రెండు వారాల ముందు తానే పోటీ చేస్తానని బాబు ప్రకటించడంతో చంద్రబాబు ఆయనకే టికెట్ ఇచ్చారు. దీంతో రాజీవ్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అప్పటి నుంచి కూడా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. పార్టీలోనే ఉన్నా.. కూడా ఆయన క్రియాశీలకంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడంలేదు. రాజీవ్ యువ పారిశ్రామిక వేత్తగా మంచిగుర్తింపు పొందారు. నవభారత్ నిర్మా ణ కంపెనీ వ్యవహారాలు ఈయనే చూసుకుంటున్నారు.బోళ్ల బుల్లిరామయ్య టీడీపీలో సీనియర్ నాయకుడు. ఈయన కుమారుడుకి, కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడైన కావూరి సాంబశివరావు కుమార్తె దంపతుల కుమారుడే రాజీవ్. దీంతో అనతికాలంలోనే రాజీవ్ గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఇద్దరు తాతల రాజకీయ వారసత్వంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ రాజకీయాల్లో రాణించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక పక్క పారిశ్రామిక వేత్తగా ఎదుగుతూనే.. మరోపక్క యువ నాయకుడిగా కూడా గుర్తింపు సాధించారు.రాజీవ్ ఎవరో కాదు చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు తోడల్లుడైన భరత్‌కు సొంత బావ కావడం గమనార్హం. అంటే చంద్రబాబు, లోకేష్‌కు రాజీవ్ చాలా దగ్గర బంధువు. అయితే, ఇప్పుడు పార్టీలో ఎలాంటి గుర్తింపూ లేక పోవడం, పార్టీ కూడా ప్రభావం కోల్పోవడం వంటి పరిస్థితి నేపథ్యంలో రాజీవ్ త్వరలోనే వైసీపీలోకి చేరిపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. రాజీవ్‌కు దగ్గర బంధువు అయిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పెండ్యాల కృష్ణబాబు మంత్రాంగంతోనే రాజీవ్ వైసీపీ ఎంట్రీ జరుగుతోందని జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజీవ్ కూడా పార్టీ మారిపోతే అది జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బే అనుకోవాలి.