అతి వేగమే ప్రమాదానికి కారణం
లక్నో, జనవరి 11
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో మంటలె చెలరేగి 20మందికిపైగా సజీహవ దహనం అయ్యారు. ఫరుఖాబాద్ నుంచి 45మంది ప్రయాణికులతో బస్సు జైపూర్ బయల్దేరింది.. మార్గ మధ్యలో చిలోయి దగ్గరకు రాగానే ట్రక్కును ఢీకొట్టింది. క్షణాల్లోనే మంటలు బస్సులో వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు కొందరు ప్రయాణికుల్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. బస్సు డీజిల్ ట్యాంక్ పగలడంతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ట్రక్కు డ్రైవర్ నిద్రమత్తు, నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదిలా ఉంటే కాన్పూర్ ఐజీ ఘటనా స్థలానికి వెళ్లారు. ప్రమాద సమయంలో బస్సులో 45మంది ఉన్నారని.. 25మందిని రక్షించామని.. వీరిలో 12మందిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. 18 నుంచి 20మంది వరకు కనిపించడం లేదన్నారు.. వారు చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నామన్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.