సీయేయే యాక్ట్ అమల్లోకి..
మోదీ సర్కార్ దూకుడు, గెజిట్ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ, జనవరి 11
పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. జనవరి 10 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ, ఎన్నార్సీపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలు పెల్లుబుకుతుండగా.. మోదీ సర్కార్ తనదైన దూకుడు ప్రదర్శించింది. తాజా చట్టం ప్రకారం... 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్‌లో మతపరమైన హింసను ఎదుర్కొని భారత్‌లోకి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు భారత పౌరసత్వం పొందేందుకు అవకాశం లభించింది. ఆయా దేశాల్లో మతపరమైన వేధింపుల్ని తట్టుకోలేక వచ్చిన వారికి భారత పౌరసత్వం లభించనుంది.పౌరసత్వ సవరణ బిల్లు డిసెంబర్ 11న పార్లమెంట్ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో బిల్లు చట్టంగా మారింది.పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. పలు ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం ఆధ్యర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో మోదీ ప్రభుత్వంపై అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు.