YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆరోగ్యం తెలంగాణ

బాలామృతం గోల్ మాల్

బాలామృతం గోల్ మాల్

బాలామృతం గోల్ మాల్
నిజామాబాద్, జనవరి 11,
బాలల్లో పోషక సమస్యలను అధిగమించే లక్ష్యంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బాలామృతం దారి తప్పుతోంది. అధికారుల నిఘా కొరవడటం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ లోపించడంతో అంగన్‌వాడీలకు చేరుతున్న బాలామృతం లబ్ధిదారుల చెంతకు చేరకుండానే గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలను సకాలంలో తెరవకపోవడం, లబ్ధిదారులకు పంపిణీలో జాప్యం చేస్తుండటంతో పేరుకుపోయిన స్టాకును వెనక్కి పంపకుండా నిర్వాహకులు టోకుగా వ్యాపారులు, రైతులకు విక్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బాలామృతం పంపిణీ ప్రక్రియ తంతు ఇదే తరహాలో జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే గుడ్లు, నూనె ప్యాకెట్లు, బియ్యం కోటాను కూడా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు బ్లాక్‌ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. చిన్నారులకు అత్యధిక పోషకాలు అందేందుకు వీలుగా ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారమే బాలామృతం. పాలపొడితోపాటు బియ్యం, గోదుమలు, శనగలు, చక్కెర ముడిపదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. వంద గ్రాముల బాలామృతం తినిపించే బాలలకు 11 గ్రాముల ప్రొటీన్లు, 367 మిల్లీగ్రాముల కాల్షియం అందడంతోపాటు మొత్తంగా 414 కేలరీల శక్తి లభిస్తుంది. మూడేళ్లలోపు చిన్నారులకు రోజుకు సగటున వంద గ్రాముల బాలామృతాన్ని  అందిస్తే సమతుల్య పోషకాహారం అందినట్లే. రాష్ట్రంలో 149 సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టులున్నాయి. ఇందులో 99 ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 25 ప్రాజెక్టులు పట్టణ ప్రాంతాల్లో, మరో 25 ప్రాజెక్టులు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. గత నెల గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 4,31,310 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. అలాగే ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న చిన్నారులు 10,42,675 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులు 6,54,165 మంది ఉన్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మెనూ ప్రకారం పాలు, గుడ్డు, భోజనంతోపాటు బాలామృతంతో చేసిన పదార్థాలను పంపిణీ చేయాలి. దీనికి అదనంగా ఇంటి వద్ద కూడా తినేందుకు వీలుగా నిర్దేశిత మొత్తాన్ని ప్యాకెట్‌ రూపంలో ఇవ్వాలి. కానీ చాలా చోట్ల బాలామృతం పంపిణీ జరగట్లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సమయపాలన సాగకపోవడం, తెరిచిన సమయంలో పిల్లల హాజరు లేకపోవడంతో బాలామృతం పంపిణీ ఆశించిన స్థాయిలో లేదు. అంగన్‌వాడీలకు సరఫరా చేసే బాలామృతం స్టాకును చిన్నారులకు ఇవ్వడంలో అవకతవకలు జరుగుతున్న అంశంపై ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులు దాదాపు 17 లక్షల మంది నమోదైనప్పటికీ వారి హాజరు శాతం ఆధారంగా బాలామృతాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నెలకు సగటున 325 మెట్రిక్‌ టన్నుల బాలామృతాన్ని పంపుతున్నా ఇందులో సగం కూడా పిల్లలకు చేరడం లేదనే ఆరోపణలున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు హాజరయ్యే చిన్నారుల్లో మూడేళ్లలోపు వారికి రోజుకు వంద గ్రాములు, ఆరేళ్లలోపు వారికి రోజుకు 50 గ్రాముల చొప్పున బాలామృతాన్ని ఇవ్వాలి. వాటికి అధనంగా ప్రతిరోజూ పాలు, ఉడికించిన కోడిగుడ్డు, మినీ మీల్‌ ఇవ్వాలి. మూడేళ్లలోపు చిన్నారికి అదనంగా తల్లిపాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మెజారిటీ అంగన్‌వాడీ కేంద్రాలు సమయానికి తెరుచుకోవడం లేదు. కొన్నిచోట్ల తెరిచినప్పటికీ చిన్నారుల హాజరు శాతం ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలామృతం, ఇతర ఆహారాల పంపిణీ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే నెలావారీగా ఈ కేంద్రాలకు ప్రభుత్వం స్టాకు పంపిణీ చేస్తున్నప్పటికీ అంతటా పూర్తిస్థాయి కోటాను లబ్ధిదారులకు ఇస్తున్నట్లు రికార్డులున్నాయి. ఎక్కడ కూడా స్టాకు మిగిలిందంటూ తిరిగి వెనక్కు పంపడమో లేదా తదుపరి కోటాను తగ్గించి తీసుకోవడమో చోటుచేసుకోవట్లేదు. మరి పంపిణీ కాని స్టాకు ఎక్కడికి వెళ్తోందనే దానిపై అధికారులకు సందేహాలున్నప్పటికీ ఇప్పటిదాకా చర్యలు మాత్రం లేవు. చాలాచోట్ల బాలామృతం కోటాను రైతులకు, ఇతర ఫీడ్‌ దుకాణాలకు నిర్వాహకులు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బాలామృతాన్ని పశువుల దాణాగా చాలా మంది రైతులు వినియోగిస్తున్నట్లు సమాచారం. అంగన్‌వాడీల ద్వారా పిల్లలకిచ్చే పోషకాహార పంపిణీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండటంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ ఎలా ఉందనే అంశంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రాథమికంగా నిర్ణయించారు. తనిఖీలకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని, గోప్యంగా పర్యటనలు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం. తనిఖీలు ఎలా చేయాలి? తనిఖీల్లో ఎవరెవరు ఉండాలనే అంశంపై ఆ శాఖలో చర్చ జరుగుతోంది. త్వరలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అంగన్‌వాడీ కేంద్రాల స్థితిని తేల్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. 

Related Posts