సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ?
కరీంనగర్, జనవరి 13,
సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల నెలకొల్పే అవకాశమున్నది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిరిసిల్లలో పర్యటించి సాధ్యాసాధ్యాలను 2019, సెప్టెంబర్‌లోనే పరిశీలించింది. సిరిసిల్ల జిల్లాలోని సర్దాపూర్, పెద్దూర్, వెంకటాపూర్‌లో స్థలాలను కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఈ సాయిబాబారెడ్డి, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులు ఎ కృష్ణయ్య పరిశీలించారు. ఇంజినీరింగ్ కాలేజీ నెలకొల్పేందుకు సిరిసిల్లలోని సర్దాపూర్, వెంకటాపూర్ అనువైన ప్రాంతమని నివేదిక ఇచ్చారు. అక్కడ 88 ఎకరాల ప్రభుత్వభూమి అందుబాటులో ఉన్నది. ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజీని స్థాపిస్తే సిరిసిల్లతోపాటు సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిరిసిల్లలో ఇంజినీరింగ్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యే అవకాశమున్నది. రానున్న బడ్జెట్‌లో సిరిసిల్లలో ఇంజినీరింగ్ కాలేజీ నెలకొల్పేందుకు రూ.100 కోట్లు కేటాయించే అవకాశమున్నట్టు తెలిసింది. ఈ దిశగా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంకోవైపు స్థలం ఎంత ఉండాలి, ఏయే కోర్సులుండాలి, బోధన, బోధనేతర సిబ్బంది ఎంత మంది ఉండాలి, మౌలిక వసతులు, తరగతి గదులు, ల్యాబ్‌లు, అధ్యాపకుల నివాస గృహాలు, విద్యార్థులకు హాస్టళ్లు వంటి అంశాలకు సంబంధించి తుది నివేదిక రూపకల్పనలో కమిటీ సభ్యులు నిమగమయ్యారు. శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించే అవకాశమున్నది.సిరిసిల్లలో నెలకొల్పే ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, మారెట్ అవసరాలకు అనుగుణంగా ఉండే కోర్సులనే ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటాసైన్స్, బిజినెస్ అనలిటిక్స్‌తోపాటు ఉపాధి చూపే కోర్సులుండే అవకాశమున్నది. అయితే కొత్తగా ఇంజినీరింగ్ కళాశాల నెలకొల్పేందుకు మౌలిక వసతులు, భవనాల నిర్మాణానికి రూ.300 కోట్లు అవసరమవుతాయని కమిటీ అంచనా వేసినట్టు తెలిసింది. బోధన, బోధనేతర సిబ్బంది జీతాలకు మరో రూ.50 కోట్లు కావాలని సూచించినట్టు సమాచారం. అయితే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఒకేసారి ఇన్ని కోట్లు ఇవ్వడం సాధ్యమయ్యే అవకాశాల్లేవు. అందుకే వచ్చే బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయిం చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆ తర్వాత అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించే అవకా శమున్నది. ఇంకోవైపు కేంద్రం సహకారం తీసుకోవాలని అధికారు లు భావిస్తున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నుంచి నిధులు పొందే అవకాశాలను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా సిరిసిల్లలో ఇంజినీరింగ్ కాలేజీని స్థాపించే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నది. ప్రస్తుతం జేఎన్టీయూ హైదరాబాద్‌కు అనుబంధంగా సుల్తాన్‌పూర్, మంథని, జగిత్యాలలో ఇంజినీరింగ్ కాలేజీలున్న విషయం తెలిసిందే.