YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అందని ఉపకారం

అందని ఉపకారం

అందని ఉపకారం (కృష్ణాజిల్లా)
మచిలీపట్నం, జనవరి 13 పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏడాది అందచేసే ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు నెలల తరబడి నిలిచిపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. పెద్దమొత్తంలో ఫీజులు బకాయిలున్న నేపథ్యంలో ఆ ప్రభావం తమపై పడుతోందంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బిల్లులు, ఉపకార వేతనాలు, కాస్మొటిక్‌ ఛార్జీలు గడచిన కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్న లక్ష్యంతో ఇంజినీరింగ్‌, డిగ్రీ, ఇంటర్‌, పీజీ, తదితర కోర్సులను బట్టి బోధనారుసుమును ప్రభుత్వమే చెల్లిస్తుంది. గతంలో ఆయా కళాశాలల బోధనారుసుములతో నిమిత్తం లేకుండా నిర్ణీత మొత్తంలో నిధులు విడుదల చేస్తే మిగిలిన మొత్తాన్ని విద్యార్థులే భరించేవారు. ఇటీవల కాలంలో ఆయా కోర్సులు, కళాశాల భోధనారుసుములకు అనుగుణంగా గరిష్ఠంగా రమారమి రూ.1.50 లక్షల వరకూ ప్రభుత్వమే భరిస్తోంది. ఈ మొత్తాన్ని విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి విడతల వారీ నిధులు మంజూరు చేసేవారు. వసతి గృహాల్లో ఉండేవారికి కాస్మొటిక్‌ ఛార్జీల రూపంలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. పేద వర్గాలకు చెందినవారికి ఈ మొత్తం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా వరకూ ప్రైవేటు విద్యాసంస్థలు అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే రీఎంబర్స్‌మెంట్‌ ఫీజు ద్వారా తమ వార్షిక నిర్వహణ కొనసాగిస్తుంటారు. ఈ మొత్తాల నుంచి ప్రతి నెలా బోధకులకు జీతాలు చెల్లిస్తుంటారు. గడచిన కొన్ని నెలలుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి బకాయిలు విడుదల కాకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా వారు విద్యార్థులను ఒత్తిడి గురిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. జిల్లాలో ఇంటర్‌, డిగ్రీ, వృత్తివిద్య, డీఈడీ, బీఈడీ, నర్సింగ్‌, పీజీ, బీటెక్‌, బీఫార్మసీ, తదితర కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బిల్లులు దాదాపు 2017 నుంచి సక్రమ చెల్లింపులు లేకుండా నిలిచిపోయాయి. ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా బకాయిల వివరాలు తెలుసుకున్న విద్యార్థులు దశలవారీ ఆందోళనలు చేశారు. చివరికి ప్రైవేటు విద్యాసంస్థ యాజమాన్యాలు సైతం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించాయి. గత ప్రభుత్వ హయాంలో ఏడు నెలలు, ప్రస్తుతం ఆరు నెలలుగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. గత ఏడాది ఒక త్రైమాసికానికి సంబంధించి రీఎంబర్స్‌మెంట్‌ బిల్లులు విడుదల చేశారు. అప్పటి నుంచి నిధులు విడుదల లేకపోవడంతో కొన్ని కళాశాలల్లో నెలల తరబడి అధ్యాపకులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అన్ని రకాల బిల్లులు కలిపి రమారమి రూ.500 కోట్లపైబడి బకాయిలు పేరుకుపోయాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖలో 72,812 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా 48,495 మంది వరకూ నిధులు మంజూరయ్యాయి. ఈబీసీ కింద 16,488 మంది నమోదు చేయించుకోగా 2,499 మందికి, ఎస్సీ కార్పొరేషన్‌లో 40,075 మంది నమోదవ్వగగా 27,214 మందికి నిధులు కేటాయించారు. ఈ నిధులకు సంబంధించి బిల్లులు మంజూరు చేసి ఖజానాలకు నివేదించినట్టు ఆయా సంక్షేమశాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆ బిల్లులకు క్లియరెన్స్‌ లభించాల్సి ఉంది. బిల్లులు సమర్పించి నెలలు గడుస్తున్నా ఎప్పటికి క్లియరెన్స్‌ లభిస్తుందనే విషయం సమాధానం దొరకని ప్రశ్నగా మిగులిపోతోంది. ఓపక్క విద్యా సంవత్సరం మరో కొద్ది నెలల్లో ముగిసే పరిస్థితికి చేరువ అవుతున్నా నిధుల విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా సత్వరం స్పందించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు.

Related Posts