అత్తారింట్లో బాల్యం.. (కర్నూలు)
కర్నూలు, జనవరి 13 బాల్యం అత్తారింటి మెట్లెక్కుతోంది. బడికెళ్లాల్సిన వయసు కుటుంబ భారాన్ని మోస్తోంది. స్నేహితులతో గడపాల్సిన చిరుప్రాయం..మరో చిన్నారిని సంరక్షిస్తోంది. తల్లిదండ్రుల అవగాహనలేమి, నిరక్షరాస్యత కారణంగా... ఆచారాలు, మూఢనమ్మకాల ముసుగులో చిన్నారుల జీవితాలను నాశనం చేస్తున్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో బాల్య వివాహాలు చేస్తుండటం ఒకటైతే, జీవితాంతం తోడుండాల్సిన భర్త ప్రమాదవశాత్తూ చనిపోతే వితంతువుగా, అత్తారింటిలోనే పిల్లలను పోషించుకుంటూ బతకాలని దురాచారం గిరి గీసింది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో చాలామంది పిల్లలకు 13-15 ఏళ్లలోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. ప్రధానంగా కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాలతోపాటు ఆదోని, ఆలూరు తదితర ప్రాంతాల్లో బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. జిల్లాలో ఐసీడీఎస్ అధికారులు ఈ ఏడాది 25 బాల్యవివాహాలు అడ్డుకుని కౌన్సిలింగ్ ఇవ్వగా అత్యధికంగా పశ్చిమ ప్రాంతంలోనే ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. చిన్న వయసులోనే వివాహాలు చేసుకుని రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్యా ఎక్కువే. కౌతాళం, కోసిగి ప్రాంతాల్లో మరో మూఢ నమ్మకాన్ని పాటిస్తున్నారు. ఒకసారి పెళ్లై భర్త చనిపోతే రెండో పెళ్లి చేయడానికి ఆచార..సంప్రదాయాలు ఒప్పుకోవడం లేదు. జీవితాంతం భర్త ఇంటి(అత్తమామల) వద్ద తమ పిల్లలను చూసుకుంటూ ఒంటరి జీవితం గడపాల్సిందే. అత్తమామలు వృద్ధాప్యంలో ఉండటంతో కూలి పనులకు వెళ్లైనాసరే కుటుంబాన్ని పోషించాలి. తన బిడ్డలకు మంచి చదువులు చెప్పించలేక, కుటుంబ పోషణ భారమై కన్నీటి కష్టాలు అనుభవిస్తున్నారు. కౌతాళం మండలంలో 6,886 మంది పింఛన్లు తీసుకుంటుండగా...అత్యధికంగా 3,707 మంది చిన్న వయసులో వితంతు పింఛన్లు పొందుతున్నారు. ఇలా ఒక్క మంత్రాలయం నియోజకవర్గంలోనే సుమారు 11,554 మంది వితంతువులు ఆచారాల నడుమ నలిగిపోతున్నారు. ఆచారాలు ఎక్కువగా ఉన్న మంత్రాలయం నియోజకవర్గంలో పరిశీలిస్తే కోసిగిలో 33% అక్షరాస్యత ఉంది. పెద్దకడబూరులో 40%, కౌతాళం 43.4%, మంత్రాలయం 63% అక్షరాస్యత ఉంది. ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టి వితంతువులుగా కుటుంబ పోషణకు కష్టపడుతున్న మహిళలకు రాయితీ రుణాలు అందించాల్సిన ఆవశ్యకత ఉంది. చిరువ్యాపారం చేసుకుంటామని ముందుకొచ్చేవారికి ముద్ర రుణాలు అందించగలిగితే స్వశక్తితో నిలబడే ధైర్యం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. సొంత ఇల్లు సైతం లేక అద్దె ఇళ్లల్లో జీవనం నెట్టుకొస్తున్నామని, ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించాలని ఎక్కువమంది కోరుతున్నారు.