YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నదీ జలాలపై తెలుగు రాష్ట్రాల సీఎం ల చర్చ

నదీ జలాలపై తెలుగు రాష్ట్రాల సీఎం ల చర్చ

నదీ జలాలపై తెలుగు రాష్ట్రాల సీఎం ల చర్చ
హైద్రాబాద్, జనవరి 13, 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఇరువురు సీఎంల భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు తదితర ఆంశాలపై చర్చించారు. తాజా రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మూడు రాజధానుల అంశం, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన, ఇతర పెండింగు అంశాలపైనా ఇరువురు సీఎంలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్‌ ఉద్యోగులు, డీఎస్పీల విభజన, ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపు తదితర అంశాలపై చర్చిస్తారని సమాచారం.ఇద్దరు సీఎంలు గతంలో మూడు సార్లు భేటీ అయ్యారు. నదీజలాలు, విద్యుత్‌ ఉద్యోగులు తదితర విభజనకు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విభజన సమస్యలను పరిష్కరించుకొనేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు అప్పటి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ చొరవతో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి అనువైన వాతావరణం ఏర్పడింది.2019లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. వారితో గవర్నర్‌ ప్రాథమికంగా భేటీ అయిన సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకొచ్చారు. ఖాళీగా ఉన్న సచివాలయ భవనాలను సీఎం కేసీఆర్‌ కోరిక మేరకు తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ సీఎం జగన్‌ సుముఖత వ్యక్తంచేశారు. ఆ వెంటనే సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించారు. అనంతరం విభజన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2019 జూన్‌ 11వ తేదీన నాటి గవర్నర్‌కు ఏపీ సీఎం జగన్‌ లేఖరాశారు. స్పందించిన గవర్నర్‌.. విభజన సమస్యలను మంచి వాతావరణంలో పరిష్కరించుకోవాలని కోరు తూ 2019 జూన్‌ 12న ఇరురాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు.ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో లంచ్ తర్వాత భేటీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.ప్రగతి భవన్ చేరుకున్న వైఎస్ జగన్‌కు సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. సీఎం జగన్ వెంట వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు.

Related Posts