ఐదారేళ్ల పిల్లలకే కిడ్ని ప్రాబ్లమ్స్
నల్గొండ, జనవరి 14,
కిడ్నీ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు కొద్ది మంది పెద్ద వాళ్లకే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు చిన్న పిల్లలనూ వదలడం లేదు. దీంతో ఐదారేండ్ల పిల్లలకూ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ప్రొటీన్లను వడబోసే ఫిల్టర్లు దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో కిడ్నీ సమస్యల బారిన పడుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వంద మంది కిడ్నీ పేషెంట్లలో పది మంది పదేండ్లలోపు పిల్లలే ఉంటున్నారని చెబుతున్నారు. ఎర్లీ స్టేజ్‌లో గుర్తిస్తే వీటన్నింటిని నయం చేయొచ్చని, పేరెంట్సే ఇందుకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.పుట్టుకతో వచ్చే సమస్యలు, జన్యులోపాలు, ఇన్ఫెక్షన్స్, తక్కువ బరువుతో పుట్టడం, నెలల నిండకుండా పుట్టడం వంటి పలు కారణాలు పిల్లల కిడ్నీలను దెబ్బతీస్తున్నాయి.చిన్నవయసు నుంచే జంక్ ఫుడ్ అలవాటు చేయడం, సరిపడా నీరు తాగకపోవడం కూడా కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతోంది. ఇటీవల విడుదలైన నేషనల్ న్యూట్రిషన్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. పిల్లలకు కిడ్నీ జబ్బులు ఎక్కువగా వస్తున్న టాప్ 4 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, సిక్కిం ఉన్నట్టు వివరించింది. ఈ రాష్ట్రాల్లో 5 నుంచి 9 ఏండ్ల మధ్య వయసున్న పిల్లల్లో 7 శాతానికిపైగా కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నట్టు తెలిపింది. ఇక్కడి పిల్లల మూత్రంలో సిరమ్ క్రియాటిన్ ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. పిల్లల్లో తలెత్తుతున్న కిడ్నీ సమస్యలకు జెనెటికల్ డిజార్డర్లే ముఖ్య కారణంగా ఉంటున్నాయని తెలిపింది. మేనరికపు, చుట్టరికపు పెండ్లిళ్లు చేసుకున్న వారిలో ఈ జెనెటికల్ డిజార్డర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటోందని డాక్టర్లు చెబుతున్నారు.సాధారణంగా మూత్రనాళాల నుంచి బ్లాడర్‌లోకి మూత్రం చేరుతుంది. దీనికి రివర్స్‌లో వెళ్తే వర్సికోరిట్రల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. పుట్టుకతోనే మూత్ర నాళాల నిర్మాణంలో లోపాలు ఉండడం వల్ల ఈ సమస్య వస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా రిఫ్లక్స్ డిసీజ్ వచ్చే ముప్పు ఉంటుంది. ఇలా రిఫ్లక్స్ అవడం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలో ఉండే ఫిల్టర్లు పాడవడం వల్ల, మూత్రం ద్వారా ప్రొటీన్లు బయటకు వెళ్లిపోయి కూడా కిడ్నీలపై భారం పడుతుంది. దీన్నే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటరు. జనటికల్ డిజార్డర్ లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల ఫిల్టర్లు పాడయ్యే అవకాశముంది. ఈ సమస్య ఎక్కువ మంది పిల్లల్లో కనిపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. సడెన్‌గా కాళ్లు, ముఖంలో వాపులు, పొట్ట ఉబ్బడం వంటివి కనిపిస్తే నెఫ్రోటిక్ సిండ్రోమ్‌గా అనుమానించొచ్చు. 90 శాతం కేసుల్లో మెడిసిన్‌తో సమస్య తగ్గుతుంది. పిల్లల్లో వచ్చే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కూడా కిడ్నీలను పాడు చేస్తున్నాయి. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్‌లోకి బ్యాక్టీరియా చేరడం వల్ల మూత్రనాళంలో ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. మన జీర్ణ వ్యవస్థలో ఉండే ఈ-కొలీ బ్యాక్టీరియా వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది రక్తంలోకి చేరితే, యురేమిక్ సిండ్రోమ్ అనే డిసీజ్ వస్తుంది. ఈ సిండ్రోమ్ కిడ్నీలు పాడవడానికి దారితీస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో చేసే టెస్టుల్లోనే పిల్లల్లో వచ్చే కిడ్నీ సమస్యలను గుర్తించొచ్చు.