సౌత్ సెంట్రల్ లో సీబీఐ గుబులు
హైద్రాబాద్, జనవరి 14
భారతీయ రైల్వేలో ఆదాయంలో ముందున్న దక్షిణ మధ్య రైల్వేలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రతి ఏడాది జోన్‌లో ఆరు డివిజన్లలో వేల కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, గుంతకల్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం డివిజన్లు ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే అభివృద్ధి పనుల నిర్మాణాల టెండర్లలో భారీగా అవినీతి జరుగుతోందని ఇటీవల సీబీఐకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరులో జరిగిన సీబీఐ దాడులతో దక్షిణ మధ్య రైల్వే అధికారుల్లో గుబులు నెలకొంది. గుంతకల్, విజయవాడ, నాందేడ్ డివిజన్లలో చేపట్టిన పనుల టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల్లో సీబీఐ గుబులు ప్రారంభమైందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. గత గురు, శుక్రవారాల్లో బెంగళూరు రైల్వే జోన్‌లో సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో రైల్వే ప్రధాన ఇంజనీరింగ్ అధికారుల ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో అధికారుల ఇళ్లల్లో విలువైన ఆస్తుల దస్తావేజులతో పాటు నగదు భారీగా బయటపడింది. బెంగళూరు రైల్వే జోన్‌లో ప్రధాన మార్గాల్లో భారీ అండర్ బ్రిడ్జి, భారీ వంతెనల నిర్మాణాలకు సంబంధించిన పనులల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. దక్షిణ మధ్య జోన్‌లో కొత్త రైల్వే మార్గాల్లో చేపట్టిన పనుల టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా అధికారులు గుత్తేదార్లకు అనుమతులు ఇచ్చారని ఆరోపణ ఉన్నాయి. పనులు చేపట్టక ముందు బిల్లులు మంజూరు చేశారని విమర్శలు ఉన్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కొంతమందికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. టెండర్లు పూర్తి అయినప్పటికీ అధికారులు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేయడంపై టెండర్లలో పాల్గొన్న గుత్తేదార్లు సీబీఐకి ఫిర్యాదులు చేశారు. సకాలంలో పనులు పూర్తి చేసుకున్నా వాటికి సంబంధించిన సర్ట్ఫికెట్‌లు ఇవ్వకుండా అధికారులు నాన్చుడుదోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.దక్షిణ మధ్య రైల్వే జోన్ గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు.