సుఖ భోగాల సౌభాగ్యాలకు మార్గ ద్వారం సంక్రాంతి
సంక్రాంతి వచ్చిందంటే చాలు ఏ ముంగిలి చూసినా కొలువుదీరిన ముగ్గులు వీధి అందాలను ఇనుమడింపచేస్తుంటాయి. అందులోని చుక్కలు ఆకాశంలోని నక్షత్రాలను గుర్తు చేస్తుంటాయి. నక్షత్రాలే కిందికి దిగి మనకోసం వచ్చిన ఫీలింగ్ కలిగిస్తాయి. సంక్రాంతి ముగ్గు ఒక ఎడ్యుకేషన్. ఖగోళంలో నక్షత్ర గతిని సులభంగా అర్ధం చేసుకునేందుకు నిర్దేశించిన అర్థవంతమైన పాఠమే సంక్రాంతి ముగ్గు. వినువీధిలో చుక్కలున్నట్లు మన వీధిలో ముగ్గు చుక్కలుంటాయి. ఏ గ్రహం ఎలా ప్రయాణిస్తుందో ఖగోళంలో ఏ గ్రహగతి, నక్షత్ర స్థితి ఎలా ఉందో తెలియచెప్పే సంకేతమిది. ఇలాంటి ప్రత్యేకతలు కోకొల్లలుగా ఉన్నందుకే సంక్రాంతి ఈ పండుగకు అంత ప్రాధాన్యం. అన్ని పండుగలూ చంద్రుని నడకకు అనుగుణంగా వస్తుంటాయి. కానీ సంక్రాంతి మాత్రం సూర్యగతిని అనుసరించి వస్తుంది. ఇది తిథి ప్రధానమైన పండుగ కాదు. ఈ పండుగను దక్షిణాయనానికి ఆఖరురోజుగా, ధనుర్మాసానికి కూడా ఆఖరి రోజుగా జరుపుకుంటాం. మకర సంక్రమణానికి పూర్వపురోజు ఈ పండుగ చేస్తారు. అయితే దీనికి భోగి పండుగ అనే నామం ఎలా వచ్చింది? కల్లాల నుంచి పంట ఇంటికి వచ్చే రోజులు ఇవి. రైతులు ఇంత కాలం వ్యవసాయ పనులతో క్షణం తీరికలేకుండా ఉంటారు. పంట ఇంటికి వచ్చిన తర్వాత రైతుకు విశ్రాంతి కావాలి. సుఖంగా కాలక్షేపం చేయడానికి అనువైన వాతావరనం కూడా ఉంటుంది కాబట్టి అలసి సొలసిన రైతుకు విశ్రాంతి కూడా దొరుకుతుంది. చేతికి అందిన పంటను అనుభవానికి తెచ్చుకొని భోగభాగ్యాలు అనుభవించడానికి రైతులకు వీలు కలిగించే పండుగ కాబట్టే దీనికి భోగి పండుగ అనే పేరు వచ్చింది. సాధారణ అర్ధంలో కూడా భోగి అంటే పండుగ ముందు రోజు అనే అర్థం కూడా ఉంది. ఉండ్రాళ్ళ తద్దికి ముందు రోజు కూడా భోగి అనే అంటారు. కాని ఇది ఎక్కువగా వాడుకలో ఉన్నది మాత్రం మకర సంక్రాంతికి మాత్రమే. ఈ మకర సంక్రాంతికి కొన్ని గ్రంథాల్లో భోగి సంక్రాంతి అనే పేరు కూడా చేర్చారు. భోగి రోజున తెల్లవారు జాము నుంచే సందడి ప్రారంభం అవుతుంది. భోగి మంటలు వేసి చలికి కాపు కాచుకుంటారు. పాటలు పాడుకుంటూ భోగిమంటల చుట్టూ తిరుగుతూ ఉంటారు. తమలోని అహంకారాలన్నీ అగ్నికి అర్పించే దానికి ప్రతీకగా ఈ పండుగను చెబుతుంటారు. ఇదంతా పెద్ద వాళ్లకు సంబంధించింది. మరి చిన్న పిల్లల సంగతి ఏమిటి? కుటుంబం మొత్తం ఆనందంగా గడపాలంటే ఆ సందర్భంలో పిల్లలను ఆనందంగా ఉంచితే చాలు అనే సూత్రాన్ని మన పెద్దలు భోగి పండుగతో జోడించారు. అందుకే చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం అనేది ఈ పండుగలో భాగం చేశారు. దృష్టి పరిహారార్థం చేసే క్రియగా కూడా దీన్ని చెబుతారు. భోగి పళ్లలో ఇందులో రేగుపళ్ళు, చిల్లర పైసలు, చెరుకు ముక్కలు వేసి తలపై నుంచి దిగువారా పోస్తారు. ఇలా చేయడం వల్ల ఆ పిల్లలకు ఆయుష్సు పెరుగుతుందని నమ్మకం. భోగి పళ్ళ ఆశీర్వాదాన్నీ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు. కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు. ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కోసం సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు. ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు. గోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీ. పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణ్ణంగా పెట్టి పోరాడుతాయి. పందం కాసేవారిని మాత్రమే కాకుండా చూసేవారిని కూడా ఈ పోరాటాలు అలరిస్తాయి. భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగురవేస్తారు. వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగరవేయడంలో పోటీపడతారు. ఇలా ఈ ముచ్చటైన సంక్రాంతి పండుగ ను చిన్నాపెద్దా అందరూ కలిసి ఆనందంగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజులు ప్రతి ఇంటా సంతోషమే. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ.