పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ)పై బీజేపీని ఉద్దేశించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు
‘‘చట్టబద్దంగా పౌరసత్వం కలిగిన వాళ్ల నుంచి దాన్ని లాక్కుని, బీజేపీకి నిధులిచ్చిన వారికి కట్టబెట్టేందుకే ఈ చట్టం చేశారా?’’ పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ)పై బీజేపీని ఉద్దేశించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చట్టబద్దంగా పౌరసత్వం ఉన్నవారి వద్ద నుంచి దాన్ని లాక్కుని... కాషాయ పార్టీకి నిధులు సమకూర్చిన విదేశీయులకు పౌరసత్వం కట్టబట్టే ‘‘కుట్ర’’లో భాగంగానే ఈ చట్టం చేశారని ఆమె ఆరోపించారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న మమత.. మొదట్నుంచీ సీఏఏను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఓ ధర్నాలో మమత మాట్లాడుతూ.. ‘‘చట్టబద్దంగా పౌరసత్వం కలిగిన వాళ్ల నుంచి దాన్ని లాక్కుని, బీజేపీకి నిధులిచ్చిన వారికి కట్టబెట్టేందుకే ఈ చట్టం చేశారా?’’ అని ప్రశ్నించారు. విదేశాల నుంచి పార్టీకి నిధులు తీసుకొచ్చిన వారికి, నల్ల ధనాన్ని తెలుపుగా మార్చే వారికి పౌరసత్వం ఇస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. గతేడాది అక్టోబర్‌లో జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాదులు బెంగాలీ కూలీలను పొట్టనబెట్టుకు న్నారనీ.. కానీ ఇతర రాష్ట్రాల ప్రజలు బెంగాల్లో క్షేమంగా నివసిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అతిథులను ఎలా చూసుకోవాలో తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.