YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమలంతో జనసేనాని అడుగులు

కమలంతో జనసేనాని అడుగులు

కమలంతో జనసేనాని అడుగులు
కాకినాడ, జనవరి 16,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంటరి పోరాటం చేస్తున్న బిజెపికి ఇప్పుడు తోడు జనసేన రూపంలో దొరికేసింది. అత్యంత ప్రజాకర్షణ కలిగిన సినీ స్టార్ గా, బలమైన సామాజికవర్గ ప్రతినిధిగా వున్న పవన్ కళ్యాణ్ తనంత తాను గా కోరివస్తే కమలం కాదని ఎందుకు అంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని కలలు గంటున్న కాషాయం పార్టీకి నమ్మకమైన నేస్తం కోసం ఎదురు చూస్తుంది. 2014 లో తమ పార్టీకి సహకరించిన జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు మరోసారి కలిసి నడుద్దాం అని స్పష్టం చేయడంతో ఎపి రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెరలేచింది. ఢిల్లీ లో తమ అధినేత డీల్ సెట్ చేయడంతో ఇప్పుడు జనసైన్యం లో ఆనందం వెల్లివిరుస్తుంది.శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని అంటారు. అది నిజం కూడా. బిజెపి తో రాజకీయాల్లో జత కట్టి ఆ పార్టీ తో ప్రత్యేక హోదా విషయంలో విభేదించి, టిడిపి ని నాలుగేళ్లపాటు సమర్ధించి, ఎన్నికల ముందు వ్యతిరేకించి చివరికి ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే సాధించి చతికిల పడింది జనసేన. అలాగే టిడిపి, జనసేన లతో జట్టు కట్టి ఎంతో కొంత లాభపడి ఆ తరువాత సొంతంగా ఎదగాలనే వ్యూహంతో ఒంటరిగా పోటీ చేసి జీరో అయిపొయింది బిజెపి. ఇప్పుడు అటు కమలానికి ఇటు టీ గ్లాస్ కి పొత్తు అనివార్యంగా పెట్టుకోక తప్పని పరిస్థితిని తాజా రాజకీయాలు కల్పించేశాయి. ఇద్దరు క్షేత్ర స్థాయిలో గట్టి పట్టు లేని పార్టీలే. అయితే ఈ రెండు పార్టీల్లో బిజెపి ఏపీ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో పార్టీ నిర్మాణం జరిగిన పార్టీ. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన అయితే ఇంకా మొగ్గ దశలోనే నడుస్తుంది.కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎపి లో ఏమి చేయలేని పరిస్థితుల్లోనే బిజెపి సాగుతుంది. తమ సత్తా చాటేందుకు వున్న అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న కమలానికి పవన్ కల్యాణ్ అవసరం వరంగా మారింది. అదే రీతిలో పవన్ కల్యాణ్ కి ఇప్పుడు బిజెపి ఆశీస్సులు అత్యవసరం. జగన్ సర్కార్ దూకుడు తట్టుకోవాలంటే చేతిలో ఏదో ఒక పవర్ తక్షణ అవసరం గా గుర్తించి టిడిపి తో లాభం లేదని పవన్ కల్యాణ్ సైకిల్ దిగే నిర్ణయానికే ఆమోదం తెలిపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకోసం ఆయన చేసిన ఢిల్లీ ప్రదక్షిణాలు మొత్తానికి ఫలితం ఇచ్చినట్లే కనిపిస్తుంది. ఇద్దరి పొత్తు ఉభయకుశలోపరి గా ఉంటుందని లెక్కేసిన బిజెపి అధిష్టానం ఇక జనసేన దిశా దశా నిర్ణయించనుంది. జనసేన – బిజెపి దోస్తీ ఇప్పుడు ఏపీ లో ఎలాంటి పరిణామాలు సృష్టిస్తుందన్నది వేచి చూడాలి. ఈ రెండు పార్టీలు వచ్చే స్థానిక ఎన్నికలకు కలిసి నడిచే వాతావరణం స్పష్టం అవుతున్న నేపథ్యంలో ప్రజలు దీన్ని ఏ మేరకు ఆమోదిస్తారో ఫలితాలు చెప్పనున్నాయి.పవన్ కల్యాణ్ మొత్తానికి ఫిక్స్ అయిపోయారు. బలంలేని బీజేపీతో బలం కూడగట్టు కోవాలను కుంటున్న పవన్ కల్యాణ్ పొత్తుకు సిద్ధమయ్యారు. ఈనెల 16వ తేదీన విజయవాడ గేట్ వే హోటల్ లో బీజేపీ, జనసేన రాష్ట్ర స్థాయి నేతల సంయుక్త సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన, రాజధాని అమరావతి తరలింపుపై ప్రధానంగా చర్చించనున్నారు.బీజేపీ కూడా కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరికొందరు ముఖ్యనేతలు పాల్గొొనే సమావేశంలో రాజధాని అమరావతి అంశమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ చర్చ జరిగే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని ఇప్పటికే జనసేన ఫిక్స్ అయింది. బీజేపీతో కలసి పోటీ చేస్తే అత్యధిక స్థానాలను జనసేన తీసుకునే అవకాశముంది. దీనిపైనా రెండు పార్టీల నేతలు చర్చలు జరుపుతారని తెలుస్తోంది.అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే? ఏపీలో బీజేపీకి నాయకులు తప్ప బలమైన క్యాడర్ లేదు. ఓటు బ్యాంకు లేదు. చరిష్మా కలిగిన నాయకుడు కూడా లేరు. జనసేనది కూడా సేమ్ టు సేమ్. కాకుంటే గ్లామర్ ఉన్న పవన్ కల్యాణ‌్ నాయకుడిగా ఉన్నారు. జనసేన ఇంకా రాష్ట్రంలో బలపడలేదు. స్థానిక సంస్థల ఎన్నికలతో బలపడాలని భావిస్తుంది. అయితే బీజేపీతో పొత్తుకు ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలో ఉండటమే. పొత్తు ఉంటే జనసేనకు కొంత మానసికంగా బలం పెరుగుతుంది. వలస నేతలు కూడా జనసేన వైపు చూస్తారు. అంతేకాకుండా అధికార వైసీపీని ఆటాడుకోవచ్చని కూడా జనసేనాని భావనగా కన్పిస్తుంది. మొత్తం మీద బలంలేని బీజేపీ వైపు జనసేన పొత్తుకు మొగ్గు చూపడం జనసేనలోనే చర్చనీయాంశమైంది.

Related Posts