ఆగని సైబర్ నేరాలు
హైద్రాబాద్, జనవరి 16
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ పెరిగిపోతున్న కొలది సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్న బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే పెరిగిపోతుంది. నకిలీ ఈ-మెయిల్స్, ఫోన్‌కాల్స్‌తో బ్యాంకు ఉద్యోగులమని చెప్పడం, ఫేక్ మెసేజ్ లు పెట్టడం, లాటరీలు వచ్చాయని నమ్మించడం, యువతులు, మహిళలకు అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు పంపి, మానసికంగా వేధిస్తుండడం ఇలా ఒక్క టేమిటి ఎన్నో రకాల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దాంతో బాధితులు లబోదిబో మంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజధాని హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సుమారు రూ.70కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో సైబర్‌ల్యాబ్స్‌ను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ ఏర్పాటుచేశారు. ఈ ల్యాబ్స్ లో దాదాపుగా 165 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో అడిషనల్ ఎస్పీ నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు ఉన్నారు. వీరికి సైబర్ నేరాలను నియంత్రించేందుకు సైబర్‌టూల్స్ వాడకం, సైబర్ నేరాల పరిశోధనలో అనుసరించాల్సిన వ్యూహాలు, మెళకువలు, అత్యాధునిక పద్ధతులపై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ఇచ్చే వారిలో డీజీపీ కార్యాలయంలోని లెర్నింగ్ సెంటర్‌లో విదేశీ నిపుణులు, రాష్ట్ర పోలీస్ విభాగంలోని సైబర్ నిపుణుల ఉన్నారు. దీని ద్వారా రాష్ట్ర నలుమూలల్లో జరుగుతున్న సైబర్ నేరాల పరిశోధన వేగవంతమవుతున్నది. దీంతో బాధితులు హైదరాబాద్ కు వెళ్లకుండా వారి జిల్లాలోనే సమస్య పరిష్కరించుకోవచ్చు.ఇక పోతే రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతుంది. 2018లో 1,205 కేసులు నమోదుకాగా 532 కేసులను సైబర్‌క్రైం పోలీసులు చేధించారు. 2019లో నవంబర్ వరకు 2,240 కేసులు నమోదుకాగా 568 కేసులను పరిష్కరించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధి మినహాయించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 2018లో 297 కేసులు, 2019లో 411 కేసులు నమోదయ్యాయి. ఏడాది ఏడాదికి నేరాల సంఖ్యపెరిగిపోవడంతో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని తెలుపుతున్నారు. ఎవరికీ కూడా తమ బ్యాంకు ఖాతా వివరాలను తెలపకూడదని హెచ్చరించారు.