YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పవన్ కు లెక్కుంది...

పవన్ కు లెక్కుంది...

పవన్ కు లెక్కుంది...
విజయవాడ, జనవరి 16
బయటకు చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ కి మనసులో బలంగా ఉంది ఏపీకి ముఖ్యమంత్రి కావాలని. ఈ కారణంగానే ఆయన నాడు కూటమి నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేసారు. దానికి పొరుగున ఉన్న కర్నాటక కుమారస్వామి కూడా ఒక స్పూర్తిగా ఉన్నారంటారు. హంగ్ అసెంబ్లీ వస్తుందని, అపుడు కొన్ని సీట్లు సాధించిన తాను ముఖ్యమంత్రిగా కిరీటం పెట్టుకోవచ్చునని పవన్ పెద్దాశే పడ్డారు. కానీ జరిగింది వేరు. పవన్ కల్యాణ్ పార్టీ సోదిలోకి లేకుండా పోయింది. మరో వైపు వైసీపీకి బంపర్ మెజారిటీ వచ్చేసింది. దీంతో గత ఎనిమిది నెలలుగా మధన పడిన పవన్ కల్యాణ్ చివరికి బీజేపీతో దోస్తీకి సై అంటున్నారు. జాతీయ స్థాయిలో బలంగా ఉన్న బీజేపీతో కలవడం ద్వారా తన చిరకాల కోరికను తీర్చుకోవచ్చునని అంచనా వేసుకుంటున్నారు.ఏపీలో బీజేపీ పరిస్థితి చూస్తే ఆ పార్టీకి బలమైన నాయకుడు లేడు. అది పవన్ కల్యాణ్ కి అతి పెద్ద అడ్వాంటేజ్. బీజేపీలో కొత్తగా చేరిన ఎంపీలు కూడా స్వయంప్రకాశం ఉన్న వారు కాదు, మరో వైపు రాజకీయ ఎత్తులు, జిత్తులు బీజేపీకి బాగా తెలుసు. ఇపుడు ఏపీలో వైసీపీ బలంగా ఉన్నా కూడా ఎన్నికల వేళకు ఎలాగైనా మ్యాజిక్ చేయడానికి బీజేపీ రెడీగా ఉంటుంది. దానికి అధికార బలం కూడా తోడుగా ఉంటుంది. బీజేపీతో కలిస్తే తన సీఎం కల నెరవేర్చుకోవడానికి పెద్దగా ఇబ్బందులు ఉండవని భావించే పవన్ కల్యాణ్ ఈ వైపుగా వచ్చారని అంటున్నారు.మరో వైపు ఏపీలో టీడీపీ వేగంగా క్షీణిస్తోందని బీజేపీ నమ్ముతోంది. పవన్ కల్యాణ్ కూడా అదే అనుకుంటున్నారు. ఇపుడు అర్జంట్ గా టీడీపీకి ఆక్సిజన్ కావాలి. అది బీజేపీ మాత్రమే ఇవ్వగలదు, అటువంటి బీజేపీని తనవైపునకు పవన్ కల్యాణ్ తిప్పేసుకున్నారు. ఇక బీజేపీకి కూడా ఏపీలో ఎదిగేందుకు స్కోప్ కావాలి. టీడీపీ ఏపీ పొలిటికల్ సీన్ నుంచి పక్కకు జరిగితే ఆ స్పేస్ లో కుదురుకోవాలని బీజేపీ ఆరాటం. ఇలా ఉభయతారమంత్రంగా ఈ పొత్తు ఉంది. ఇద్దరి టార్గెట్ కూడా ఇపుడు టీడీపీ అవుతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మళ్ళీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ సీఎం అవుతారు. అదే బీజేపీ వైపు వస్తే అసలు పోటీయే ఇక్కడ లేదు. అదే పవన్ కల్యాణ్ తెలివైన ఎత్తుగడగా భావిస్తున్నారు.ఇక ఈ అర్జంట్ పొత్తు వెనకాల మరో భారీ అత్యాశ కూడా ఉందని అంటున్నారు. జగన్ పార్టీకి 151 సీట్లు వచ్చినా కూడా ఆయన మీద సీబీఐ కేసుల కత్తి వేలాడుతోంది. జగన్ ముఖ్యమంత్రి హోదాలో కూడా కోర్టు ముందు హాజరవుతున్నారు. ఈ కేసుల విషయంలో కేంద్రం కనుక మరింత సీరియస్ గా ఉంటే వాటి ఫలితాలు వేరేగా ఉంటాయి. జగన్ కనుక జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తే వైసీపీ పార్టీగా కూడా ఎలా ఉంటుందో చెప్పలేని స్థితి. అపుడు కేంద్రమే కీలక పాత్రలో రంగంలోకి దిగుతుంది. ఆ సమయంలో పొత్తు కలిగి ఉన్న పవన్ కల్యాణ్ కి లక్ జాక్ పాట్ లా తగిలితే ఏ ఎన్నికలూ లేకుండానే సీఎం కుర్చీలో కూర్చునే అవకాశాలు కూడా ఉంటాయట. ఇది అతి పెద్ద అత్యాశగా ఇప్పటికైతే ప్రచారంలో ఉన్నా కూడా రాజకీయాల్లో ఏదీ జరగదు అని కొట్టిపారేయలేని పరిస్థితి కాబట్టి అన్నీ లెక్కలూ వేసుకునే పవన్ కల్యాణ్ బీజేపీతో జట్టు కట్టాడని అంటున్నారు.

Related Posts