అయోధ్య-శ్రీరాముడు
రాముడి వంటి కొడుకు, సీత లాంటి భార్య, లక్ష్మణుడిని పోలిన తమ్ముడు, హనుమంతుడికి సాటి అయిన బంటు ప్రపంచంలో ఎక్కడా ఉన్నట్లు కనిపించరు. మానవాళి నివాళిని అందుకుంటూ, ఈనాటికీ అందరి హృదయ మందిరాల్లో వీరు కొలువుతీరి ఉన్నారు.
ఇక్ష్వాకు వంశంలో ధర్మం మూడు పాదాలకు చేరిన సందర్భంలో రాముడు జన్మించడం వల్ల ధర్మం యుగాంతం దాకా నిలబడింది. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని అనాదిగా వేదాలు ఘోషిస్తున్నాయి. సత్యం వద- ధర్మం చర అన్న నానుడి అందరి నాలుకలపైనా నాట్యం చేస్తూనే ఉంది. సత్య ధర్మాలు దారిదీపాలుగా రామరాజ్యం వెల్లివిరిసింది.
పురాణాలు మిథ్యాకేంద్రాలు కావని, సత్య ధర్మాల సజీవ ప్రతీకలని, రామాయణం అందుకు తగ్గ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వేదవ్యాసుడు విద్యాకేంద్రాలైన వేదాల సారాన్ని పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా అందించాడు. అవి ఆయన సత్యధర్మ పరాక్రమానికి అద్దం పడుతున్నాయి. మన పెద్దలు ఎలా జీవించారు, ఎంత కాలం జీవించారు, ఎంత బాగా జీవించారు అని తెలుసుకుని వారు పరచిన బంగారు బాటలో నడవటం చారిత్రక అవసరం.
ప్రపంచమనే పాఠశాలలో జీవిత పాఠాలు నేర్చుకుని, భావితరాలకు మార్గదర్శనం చేయించడానికి ఆర్ష రుషులు తపించారు. లోకహితం కోసం తమ జీవితాలను వెచ్చించారు. నాలుగు దశల్లో నాలుగు దిశల్లో జీవితాన్ని జీవించి పరమార్థం ఎలా సాధించాలో బోధించారు. పురుషార్థాల్లో ధర్మానికే మొదటిస్థానం కేటాయించారు. ధర్మంగా ధనాన్ని సాధించాలని, సంతానం కోసం కామాన్ని వాడుకొమ్మని, ఆపైన ముక్తిని కైవసం చేసుకొమ్మని నిర్దేశించారు.
వర్ణాశ్రమ ధర్మాలు దివ్య భవ్య జీవన సోపానాలు. వర్ణం ఒక స్థానం. ఆశ్రమం యోగ ప్రస్థానం. ఒకటి స్థితి, రెండోది గతి. కాలాంతరాన వర్ణం కులానికి, ఆశ్రమం వర్గానికి పరిమితమయ్యాయి. రుక్‌సంహిత నాలుగు వర్ణాలను నాలుగు అంశాలుగా వివరించింది. బ్రాహ్మణ్యం శిరస్సు; క్షాత్రం బాహువులు; వైశ్యం మొండెం; శూద్రం పాదాలు. వేదపురుషుడు శిరస్సు ఆకాశాన, పాదాలు భూమి పైన మోపినట్లు పురుషసూక్తం చెబుతోంది. నాలుగు అంగాలు సహకరించినప్పుడే మనిషి మనగలుగుతాడు. నాలుగు వర్ణాలు కలిస్తేనే సమాజం నిలబడుతుంది. తరతమ భేదాలు తాగునీటికి పట్టిన పాచి వంటివి. యజ్ఞయాగాలకు తొలి ఆహ్వానం శూద్రుడికేనని వైదిక సమాజం తేటపరచింది.
గార్హస్థ్యం తాగునీటి దిగుడుబావి లాంటిదని మనుచరిత్రలో ప్రవరుడికి స్పష్టంగా తెలిపాడు హిమాలయం నుంచి దిగి వచ్చిన యోగి. గృహమేధి స్వార్థజీవి అని, గృహస్థు ధన్యజీవి అని శ్రీ భాగవతం చెబుతోంది.
వానప్రస్థం పేర అడవి బాట పట్టినంత మాత్రాన మోక్షం సిద్ధించదు. శరీరాన్ని సమాజంలో, మనసును అరణ్యంలో ఉంచుకోగలిగివాడే నిజమైన వానప్రస్థ ఆశ్రమ అధికారి. అన్ని కార్యాలు వదిలేస్తే సన్యాసం స్వీకరించినట్లు కాదని గీత ఉపదేశిస్తుంది. నిష్కామ కర్మ జీవనం సాగిస్తూ కర్తవ్యకర్మలను కొనసాగిస్తూ జీవన యానంలో తోటివారిని భాగస్వాములు చేయడం మానవ ధర్మం. అదే జీవన్ముక్తి వివేకం. అలాంటి జీవన్ముక్తుల సంఖ్యాబలంతో భూలోకాన్ని మించిన స్వర్గం అంటూ మరొకటి అవసరం ఉండదు.
రాముడు తాను గీసుకున్న గీటును దాటలేదు. లక్ష్మణ రేఖను దాటిన సీత అగ్ని పరీక్షలకు గురికావలసి వచ్చింది. కర్మబద్ధమైన మానవజీవితం దేవదానవ తిర్యగ్‌గణాల కన్నా మిన్న. సాక్షాత్తు బ్రహ్మ దిగి వచ్చి వైకుంఠానికి తిరిగి రమ్మని రాముణ్ని అర్థించాడు. ‘నీవు నారాయణుడవు’ అని గుర్తు చేశాడు. అయినా రాముడు ‘నేను మానవుడిని- రాముడినే’ అని జవాబిచ్చి వెనక్కి పంపించాడు బ్రహ్మను. అయోధ్య రామాలయం. రామాయణం నిత్య పారాయణ గ్రంథం.