అహోబిలంలో పారువేట ఉత్సవాలు
కర్నూలు జనవరి 16,
కర్నూలు జిల్లాలో అహోబిలేశుని పారువేట ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఎగువ అహోబిలం నుండి అహోబిలేశుడు పారువేట ఉత్సవంకోసం కొండ దిగాడు. అహోబిలం లోని చెంచులు తన బావ అయిన అహోబిలేశుని పార్వేట ఉత్సవం సందర్భంగా స్వామివారికి మామిడి తోరణాలు, పార్వేట పల్లకికి అడవినారతో అహోబిల చెంచులు విల్లంబులతో నాట్యమాడుతూ దిగువ అహోబిలంకు తీసుకు వచ్చారు. 45 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 33 గ్రామ ప్రజలకు స్వామి వారు స్వయంగా వెళ్లి దర్శనభాగ్యం కల్పిస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా భక్తులే భగవంతుడి వద్దకు వెళుతుంటారు. కానీ దేవుడే భక్తుల వద్దకు వెళ్లే సందర్భం మాత్రం ఒకే ఒక్కచోట ఉంటుంది.అది అహోబిల లక్ష్మీనరసింహ స్వామికే ప్రత్యేకం. 600 సంవత్సరాల నుంచి అనాది వస్తున్న ఆచారం ప్రకారం అహోబిలం క్షేత్రంలో కొలువైన జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరద స్వాములు పల్లకిలో కొలువై గ్రామాలకు వెళ్లి భక్తులకు తమ దర్శన భాగ్యం కల్పిస్తు, భక్తులను తమ పెళ్లికి రండి అని ఆహ్వానం పలికే ఈ ప్రత్యేకమైన వరాన్ని కర్నూలు జిల్లాలోని 33 గ్రామాల ప్రజలు అందుకుంటున్నారు.