ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌కు మరోసారి ఎదురుదెబ్బ
న్యూయార్క్ జనవరి 16
ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఐరాసలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని భారత్ తిప్పికొట్టింది. పాకిస్థాన్ తన కుట్రలను పక్కనపెట్టి ఇరుదేశాల మధ్య సంత్సంబంధాలపై దృష్టి సారించాలని హితవు పలికింది. జమ్మూకశ్మీర్ విషయంలో చైనా ముందు నుంచి మద్దతుగా నిలుస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా పాక్‌కు చైనా తప్ప మరేఇతర దేశం కూడా మద్దతు ఇవ్వకపోవడం గమనర్హం.ఐరాస భద్రతా మండలి బుధవారం ఓ ఆఫ్రికన్ దేశానికి చెందిన అంశంపై చర్చించేందుకు పిలుపునిచ్చింది. కాగా, మండలిలో చర్చించాల్సిన అంశాలతో పాటు కశ్మీర్ అంశాన్ని కూడా చేర్చాలని చైనా కోరింది. కానీ ఇతర సభ్యదేశాలు కాదనడంతో చైనాకు కూడా భంగపాటు తప్పలేదు. పైగా కశ్మీర్ అంశం భారత్, పాక్ ద్వైపాక్షిక అంశమని ఐరాస స్పష్టం చేసింది.ఐరాస చర్చల అనంతరం భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కశ్మీర్ అంశాన్ని రాద్ధాంతం చేయాలనుకున్న పాకిస్థాన్ కుయుక్తులు ఏమాత్రం సాగలేవని అన్నారు. పాక్ నిరాధార ఆరోపణలు విశ్వసనీయమైనవి కాదని ఇవాళ తేలిపోయిందని ఆయన తెలిపారు. ఈ అనుభవంతో పాక్ ఇప్పటికైనా ఇరుదేశాల మధ్య మెరుగైన సంబంధాల కోసం కృషి చేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది ఆగస్టులోనూ చైనా ఇదే ప్రయత్నం చేయాలని చూసినా.. సభ్యదేశాలు తిరస్కరించడంతో తన ప్రయత్నాన్ని విరమించుకుంది.