300 మందిపై చర్యలకు సిద్ధం
హైద్రాబాద్, జనవరి 17,
రాష్ట్ర పోలీసు శాఖలో ఎంపికైన మూడు వందల మంది కానిస్టేబుళ్ల భవిష్యత్తు డోలాయమానంగా మారింది. కారణం వీరిలో మెజారిటీ అభ్యర్థులపై కేసులు ఉండటమేనని తెలుస్తోంది ఇటీవల జరిగిన పోలీసు రిక్రూట్మెంట్‌లో 16925 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీఎఫ్, ఫైర్‌మెన్ పోస్టులకు ఎంపికైన విషయం తెలిసిందే. ఇందులో 2256 మంది మహిళలు ఉన్నారు. కాగా వీరిపై రాష్ట్రంలోని వివిధ పోలీసు ట్రైనింగ్ కాలేజీలలో శిక్షణను ప్రారంభించడానికి పోలీసు ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. అలాగే శిక్షణకు ఎవరు ఏ ట్రైనింగ్ కాలేజీకి వెళ్లాలనే సమాచారాన్నీ సదరు కొత్త కానిస్టేబుళ్లకు పంపించారు. అయితే తమను ట్రైనింగ్‌కు పంపిస్తూ ఎలాంటి సమాచారం అందలేదంటూ అనేక మంది ఎంపికైన కానిస్టేబుళ్లు ఆందోళన చెందుతున్నారు. అంతేగాక వీరు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే దాదాపు మూడు వందల మంది వరకు అభ్యర్థులు ట్రైనింగ్‌కు పంపించడంలేదని సమాచారం. ఇందులో మెజారిటీ అభ్యర్థులపై రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్‌లలో కేసులు ఉండటమేనని తెలిసింది. తాము కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన సమయంలో కేసులున్న విషయాన్ని పేర్కొనలేదని తెలిసింది.వీరు ఎంపికైన తర్వాత ఇంటెలిజెన్స్, ఎస్‌బీ విభాగాల చేత ఎంక్వయిరీ చేయించిన బోర్డు అధికారులకు సదరు మూడు వందల మంది వరకు అభ్యర్థులపై కేసులున్నట్టు వెలుగు చూసింది. దీంతో క్రమశిక్షణతో కూడిన పోలీసు శాఖలో కేసులున్న వారిని విధుల్లోకి చేర్చుకోవడం ఎంత వరకు సబబు అనే మీమాంసలో టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికారులు పడిపోయినట్టు సమాచారం. ఇందులోనే మరికొందరి సర్టిఫికేట్లూ సరిగా లేని కారణంగా ట్రైనింగ్‌కు పంపలేదని తెలుస్తున్నది. మొత్తం మీద మూడు వందల మంది భవిష్యత్తు డోలాయమానంగా మారింది. వీరి గురించి ఎలాంటి చర్య తీసుకోవాలి అనే విషయమై బోర్డు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో ఒకనిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.