పండక్కి పోతే….ఇల్లు దోచేసారు
హైదరాబాద్ జనవరి 17,
పండుగకు ఊరికి వెళ్లేవారు ఇంటి దగ్గర జాగ్రత్తలు తీసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చి దొంగలబారి నుండి సొమ్మును రక్షించుకోండి అని పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, పుర జనులు ఇవేవి పట్టించుకోక దొంగలబారిన పడి భోరుమంటున్నారు..తాజాగా జీడిమెట్ల పియస్ పరిధిలో.. పండగకు ఊరెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లచేసారు. దొంగలు తాళాలు పగల గొట్టి 19 తులాల బంగారు అభరణాలను ఎత్తుకెళ్ళారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లోని సంతోష్ రెడ్డి ఇంట్లో జరిగిన చోరి ఘటన ఇది. ఇంటి యజమాని సంక్రాంతి పండుగకు ఊరికివెళ్లారు. ఇదే అదనుగా ఇంటి తాళాలు పగలగొట్టి బెడ్ రూమ్ లోని హల్మారాను తెరిచి లోపలున్న 19 తులాల బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు.. ఇంటి యజమాని సంతోష రెడ్డి శుక్రవారం తెల్లవారుజాముల ఊరి నుండి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో చోరి జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు..ఇంట్లోని ల్యాప్ టాప్, వెండివస్తువులు ఉన్నా వాటుజోలికి పోకుండా కేవలం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్ళడంతో ఇది తెలిసిన వారిపనే అని యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.