YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఇక జనసేనకు జేడీ దూరమేనా

 ఇక జనసేనకు జేడీ దూరమేనా

 ఇక జనసేనకు జేడీ దూరమేనా
విశాఖపట్టణం, జనవరి 18,
బీజేపీ, జనసేన పొత్తులతో కొత్త సమస్యలు తెరమీదకు వస్తున్నాయి. ప్రధానంగా జనసేన పార్టీలో నిన్న మొన్నటి వరకూ కీలక నేతగా ఉన్న జేడీ లక్ష్మీనారాయణ సీటుకు ఎసరు వచ్చేలా కన్పిస్తుంది. బీజేపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరింది. ఈ రెండు పార్టీలూ 2024 ఎన్నికలకు కలసి వెళతామని ప్రకటించాయి. అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని తెలిపాయి. ఈ కీలక సమావేశానికి జేడీ లక్ష్మీనారాయణను జనసేన దూరంగా ఉంచింది.జేడీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా జేడీ లక్ష్మీనారాయణ విశాఖపట్నంలోనే ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అక్కడే ఉంటూ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీ పొత్తు జేడీ లక్ష్మీనారాయణ సీటుకు ఎర్త్ పెట్టిందనే చెప్పాలి.విశాఖపట్నంలో బీజేపీ బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని బీజేపీకే కేటాయిస్తూ వస్తున్నారు. కంభంపాటి హరిబాబు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. మరో బీజేపీ కీలక నేత పురంద్రీశ్వరి సయితం విశాఖపట్నాన్ని తన కార్యాస్థలిగా ఎంచుకున్నారు. గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసిన పురంద్రీశ్వరి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూటమి ఏర్పడటంతో ఈ సీటు బీజేపీకే దక్కుతుందన్నది కాదనలేని వాస్తవం.అదే సమయంలో జేడీ లక్ష్మీనారాయణ జనసేనలోనే ఉన్నప్పటికీ ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో కీలకపదవులు ఏమీ అప్పగించకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన లేదు. బీజేపీ, జనసేనల పొత్తుతో జేడీ లక్ష్మీనారాయణ కీలక నిర్ణయం తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. విశాఖపట్నంపైనే మక్కువ పెంచుకున్న జేడీకి వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున ఆ సీటు దక్కే అవకాశం లేదన్నది సుస్పష‌్టం. దీంతో జేడీ లక్ష్మీనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కరంగా మారింది.
విశాఖలో గంటా బ్యాచ్ రెడీ అవుతున్నట్టేనా
జనసేన, బీజేపీతో పొత్తుతో ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడబోతున్నాయి. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీలో సందిగ్దంగా ఉన్న నేతలు ఇక పార్టీని వీడే అవకాశాలున్నాయన్న టాక్ బలంగా విన్పిస్తుంది. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తర్వాత నాయకత్వ సమస్య ఏర్పడటం, వైసీపీ బలంగా ఉండటంతో ఇప్పటి వరకూ వేచిచూసే ధోరణిలో ఉన్న టీడీపీ నేతలు కొందరు జనసేన, బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఇందులో గంటా శ్రీనివాసరావు పేరు బలంగా విన్పిస్తుంది.
గంటా శ్రీనివాసరావు ఎన్నికల్లో గెలిచినా ఆయన అటు ఇటుగానే ఉంటూ వస్తున్నారు. అధికార వైసీపీలో చేరాలని గంటా శ్రీనివాసరావు ప్రయత్నించినా ఆయనకు వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఆయన బీజేపీ వైైపు మొగ్గు చూపుతారన్న ప్రచారం జరిగింది. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. అలాగే లోకల్ బీజేపీ లీడర్లతోనూ తరచూ గంటా శ్రీనివాసరావు సమావేశం అవుతున్నారు. అయితే తాను పార్టీ మారనని పదే పదే చెబుతున్నప్పటికీ గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడే అవకాశమే ఉందన్న ప్రచారం మాత్రం ఆగడం లేదు.తాజాగా బీజేపీ, జనసేన పొత్తు కుదరడంతో టీడీపీ నేతల్లో ఆశలు పెరిగాయనే చెప్పాలి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటు పవన్ కల్యాణ్ కు బలమైన సామాజిక వర్గంతో పాటు అభిమానులు కూడా ఎక్కువగా ఉండటంతో ఈ కూటమి వైపు గంటా శ్రీనివాసరావు మొగ్గు చూపుతారని ఆయన సన్నిహితులు సయితం బలంగా చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ, వర్సెస్ జనసే, బీజేపీల మధ్యే పోటీ ఉంటుందన్న అంచనాకు వచ్చిన తెలుగు తమ్ముళ్లు ఈ మేరకు పెట్టేబేడా సర్దేందుకు రెడీ అయిపోయారు.గంటా శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. అయితే పవన్ కల్యాణ్ తో పెద్దగా సంబంధాలు లేవు. దీంతో ఆయన బీజేపీలో చేరి జనసేన మద్దతుతో మరోసారి రాజకీయ భవిష్యత్తును సానుకూలంగా మలచుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు గంటా శ్రీనివాసరావు నిర్ణయం తీసుకోకపోయినా త్వరలోనే ఆయన బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేసి టీడీపీని ఇబ్బంది పెట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అదే బాట పడతారన్న టాక్ విన్పిస్తుంది. మొత్తం మీద గంటా బ్యాచ్ పార్టీని వీడేందుకు రెడీ అయిందంటున్నారు.

Related Posts