అక్రమ నిర్మణాలతో ఉల్లంఘనలు
శ్రీకాకుళం జనవరి 18,
పలాస నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో విశాలమైన రహదారులు ఉన్నా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంలేదు. వాహనదారులు, ఆటోలు, ట్రక్కులు, లారీలను రోడ్లపైనే గంటల కొద్దీ నిలుపుదల చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీంతో ప్రజలు, విద్యార్థులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పలాస నియోజకవర్గంలోని పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలతోపాటు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన కూడళ్లలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు చేస్తుంటాయి. ఈ సమయంలో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం, వాహనాల రాకపోకలకు సరైన మార్గం లేకపోవడంతో వాహనదారులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లోని కొంతమంది హోల్‌సేల్ వ్యాపారులు తమ వ్యాపార లావాదేవీలు బయటకు తెలియకుండా ఉండేందుకు మారుమూల వీధుల్లో గొడౌన్‌లు ఏర్పాటుచేసుకున్నారు. ఇక్కడకు భారీ వాహనాలు ద్వారా సరుకులను ఎగుమతులు, దిగుమతులు చేస్తుంటారు. ఈ సమయంలో భారీ వాహనాలను గంటల కొద్దీ రోడ్లపైనే నిలుపుదల చేస్తుండడం, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జంటపట్టణాల్లో మొత్తం 600లకుపైగా ఆటోలు, 150 వరకు ట్రాక్టర్లు, కార్లు, జీపులు, 200 వరకు లగేజీ వాహనాలు ఉన్నాయి. వీటితోపాటు ద్విచక్రవాహనాలు, బస్సులు, లారీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ సమస్య పెరుగుతున్నా అందుకు తగిన విధంగా సిబ్బంది లేకపోవడంతో తలకు మించిన భారమవుతుందని పోలీసులు వాపోతున్నారు. హెచ్చరిక బోర్డులు, వాహనాల పార్కింగ్‌కు సరైన స్థలాలు లేకపోవడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. షాపుల ఎదుటే వాహనాలు నిలుపుదల చేస్తుండడంతో పాదచారులకు అవస్థలు తప్పడంలేదు.కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి, శ్రీనివాసలాడ్జి జంక్షన్ కూడలి, చేపల మార్కెట్ రోడ్డు, పలాస ఇందిరాచౌక్ నుంచి రెడ్డికవీధి రహదారి, ఇటు వజ్రపుకొత్తూరు, అటు మందస మండలాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గాలుగా ఉన్న పలాస ఇందిరాచౌక్, కాశీబుగ్గ మూడు రోడ్ల జంక్షన్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఉదయం తొమ్మిది గంటలు నుంచి 11 గంటలు వరకు, సాయంత్రం నాలుగు గంటలు నుంచి ఏడు గంటలు వరకు ట్రాఫిక్ సమస్య వేధిస్తుంది.
పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లోని కాశీబుగ్గ బస్టాండ్ కూడలి, మేదరవీధి నుంచి చేపల మార్కెట్, హైస్కూల్ రోడ్డు, టెలికాం కూడలి, శ్రీనివాసలాడ్జి కూడలి, ఎంపిడిఒ కార్యాలయం రోడ్డు, అక్కుపల్లి రోడ్డు, రాజా లాడ్జి జంక్షన్, ఆర్‌టిసి కాంప్లెక్స్ కూడలి, పలాస జీడి పిక్క బొమ్మ జంక్షన్, ఇందిరాచౌక్, జూనియర్ కళాశాల జంక్షన్, మొగిలిపాడు జంక్షన్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. పలాస మండలంలో బ్రాహ్మణతర్లా, గరుడఖండి, టెక్కలిపట్నం, లొద్దభద్ర, వజ్రపుకొత్తూరు మండలంలో పూండీ, బెండిగేటు, వజ్రపుకొత్తూరు, అక్కుపల్లి, గరుడభద్ర, మందస మండలంలో మందస, హరిపురం తదితర కూడళ్లలో ఎదురెదురుగా రెండు బస్సులు వస్తే ట్రాఫిక్ సమస్య జఠిలమవుతుంది. రోడ్డుకు అడ్డదిడ్డంగా భారీ వాహనాలు నిలుపుదల చేయడం వలనే ట్రాఫిక్ కష్టాలు తీరడంలేదన్న వాదన వినిపిస్తుంది.కాశీబుగ్గలో ప్రతి శుక్రవారం, మందసలో సోమవారం, పూండీలో గురు, అంబుగాంలో బుధ, సిరిపురంలో ప్రతి శనివారం వారపు సంతలు జరుగుతాయి. ఈ రోజుల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. పాదచారులు, విద్యార్థులు రోడ్డు దిగ్బంధనంలో చిక్కుకోక తప్పదు. ఆయా ప్రాంతాల్లో రోడ్లుపైనే సంతలు నిర్వర్తిస్తుండడంతో వాహనచోదకులకు అవస్థలు తప్పడంలేదు. ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు అరగంట సమయం పడుతుందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.