ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ కష్టాలు
కడప, జనవరి 18,
కొత్త ఆవిష్కరణలకు విద్యార్థి దశలోనే పునాది పడాల్సి ఉంటుంది. అందుకోసం ఇంటర్‌లో ప్రయోగాత్మక విద్యను బోధించడం జరుగుతోంది. అధ్యాపకులు, ప్రయోగశాలలు లేకపోవడం, పరికరాలు, రసాయనాలు కొనుగోలుకు నిధులు మంజూరు కాకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. దీంతో వీరికి ప్రయోగాత్మక విద్య దూరమవుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో సిబ్బంది కొరత కారణంగా ప్రయోగాలు అంతంత మాత్రంగానే సాగాయి. ప్రైవేటు కళాశాలల్లో కొంత వరకు ల్యాబ్‌లు, పరికరాలు ఉన్నా యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల చెంతకు ప్రయోగాలు చేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కొన్నింటిలో ప్రయోగశాలలు అలంకారప్రాయంగానే ఉండటం గమనార్హం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 21 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. సుమారు 18356 మంది హాజరుకానున్నారు. వారి కోసం 61 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్లు ప్రాంతీయ ఇంటర్ విద్యాపర్యవేక్షణాధికారి చెబుతున్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రాక్టికల్స్‌లోనూ, పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధిస్తే తప్ప తదుపరి కోర్సుల్లో సీట్లు సాధించలేమన్న ఆలోచనల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. రాయచోటి విషయానికి వస్తే సుమారు 3600 మంది వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షకు సిద్ధంగా ఉన్నారు. అందులో అధిక శాతం జిల్లా వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు మంది ప్రవేటు కళాశాలల్లో చదువుకుంటున్నారు.రాయచోటిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, బాలికల జూనియర్ కాలేజీ, ఏఎన్‌ఎం అండ్ బీఆర్ కళాశాల, పద్మావతి జూనియర్ కళాశాల,సీఎన్ రాజు, కాకతీయ, అర్చన, ఎస్‌బీటీ, వీరభద్ర కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని కళాశాలల్లో పరికరాలు సరిగా లేకపోవడం, మరి కొన్నింటిలో ప్రయోగశాలలు అలంకారప్రాయంగా ఉండటం కనిపిస్తున్నాయి. గత ఏడాది తరహాలోనే ఈ సారి కూడా ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తారు దీంతో పరీక్షలు ఎలా రాయాలోనని విద్యార్థులు, ఇతర కళాశాలలల్లో వీరు ప్రాక్టికల్స్ ఎలా చేస్తారోనన్న భయం యాజమాన్యంలో నెలకొంది.జంబ్లింగ్ పద్ధతిని రద్దు చేయాలని గతంలో పలువురు డిమాండ్ చేశారు.