YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఖమ్మంలో  ఇంటర్ ప్రాక్టికల్స్ కు 70 కేంద్రాలు

ఖమ్మంలో  ఇంటర్ ప్రాక్టికల్స్ కు 70 కేంద్రాలు

ఖమ్మంలో  ఇంటర్ ప్రాక్టికల్స్ కు 70 కేంద్రాలు
ఖమ్మం, జనవరి 18,
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సైన్స్‌ విద్యార్థులకు ప్రయోగ (ప్రాక్టికల్‌) పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ విడుదల చేయడంతోపాటు మార్గదర్శకాలను వెలువరించింది. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో నాలుగు విడతలుగా ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయి. 70 కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు.ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్‌ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంపీసీ విద్యార్థులకు భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం సబ్జెక్ట్‌లలో, బైపీసీ విద్యార్థులకు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం సబ్జెక్ట్‌లలో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్ట్‌లో 30 మార్కులు ఉంటాయి. ప్రతి స్పెల్‌లో ఐదు రోజులపాటు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయి. ఎంపిక చేసిన కేంద్రాలను ఆయా కళాశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్పెల్స్‌ కేటాయిస్తారు.ప్రయోగ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలను ఇంటర్‌ బోర్డు ఆదేశించింది. ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలోని 70 కేంద్రాల్లో ప్రభుత్వ కళాశాలలతో పాటు రెసిడెన్షియల్‌, ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. వసతులు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో 67 కేంద్రాల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. ఈసారి మరో మూడింటిని పెంచారు. వీటిలో 17 ప్రభుత్వ కళాశాలలు, ఆరు సోషల్‌ వెల్ఫేర్‌ కాలేజీలు, ఒక ట్రైబల్‌ వెల్ఫేర్‌ కాలేజ్‌, 45 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు, ఒక కేజీబీవీ కళాశాల ఉన్నాయి.ఇంటర్‌ ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా, విజయవంంతగా నిర్వహించేందుకుగాను అన్ని శాఖల అధికారుల సహకారం తీసుకునేందుకుగాను కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సమక్షంలో సమన్వయ సమావేశం నిర్వహించేందుకు ఇంటర్‌ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 20 తరువాత పరీక్షల నిర్వహణ సామాగ్రితోపాటు స్పెల్స్‌ వారీగా తేదీలు వెలువడే అవకాశం ఉండటంతో ఈ నెల 24న లేదా 25న సమావేశం నిర్వహిస్తారు.పరీక్షలకు గడువు సమీపిస్తుండడంతో కళాశాలల యాజమాన్యాలు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాయి. ఇప్పటివరకు కొన్ని కళాశాలలు దసరా సెలవుల్లో రికార్డులను రాయించాయి. మరికొన్ని, సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులతో పాత రికార్డులలో మాదిరిగా రాయించాయి. ఎలాంటి ప్రయోగాలు చేయకుండానే ప్రయోగ తరగతుల ప్రక్రియ తంతును ముగించేశాయి. ఇప్పుడు అప్రమత్తమైన యాజమాన్యాలు ముఖ్యమై ప్రయోగాలు చేయిస్తున్నట్లు తెలిసింది. ఇంటర్‌ మార్కుల్లో ప్రయోగ పరీక్షల మార్కులకు సైతం ప్రాధాన్యం ఉండటంతో వీటిపై యాజమాన్యాలు దృష్టి సారించాయి.జిల్లాలో ప్రయోగ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్‌ కళాశాలల్లో పరీక్షల నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ప్రైవేట్‌ కళాశాలలున్న కేంద్రాల్లో నిర్వహణలో సీఎస్‌గా, డీఓలుగా ప్రభుత్వ కళాశాలలకు చెందిన అధ్యాపకులే విధులు నిర్వర్తిస్తారు. వీరితోపాటు జిల్లా పరీక్షల విభాగం అధికారులు, ప్లయింగ్‌ స్కాడ్‌ అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు చేసేలా ఇంటర్‌ విద్యాశాఖాధికారులు రూపకల్పన చేస్తున్నారు.

Related Posts