భైంసా ప్రశాంతం…144 సెక్షన్ ఎత్తివేత
నిర్మల్ జనవరి 18
అల్లర్లతో అట్టుడికిన భైంసాలో శనివారం నాటికి ప్రశాంత వాతావరణం నెలకొంది. జనజీవనం యధావిధిగా కొనసాగుతోంది. దాంతో 144 సెక్షన్ ను పోలీసులు ఎత్తివేశారు. ఈసందర్భంగా ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ సోషల్ మీడియాతో అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. జనవరి 12న రాత్రి జరిగిన చిన్నపాటి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణ పరిధిలోని కోర్బాగల్లి ప్రాంతంలో ద్విచక్ర వాహనం వేగం, సైలెన్సర్ ధ్వనిపై మొదలైన గొడవ.. చివరకు రెండు వర్గాల మధ్య అల్లర్లకు కారణమైంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భైంసాలో కర్ఫ్యూ విధించారు. తరువాత 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసులు మోహరించి ఎలాంటి ఘటనలు జరుగకుండా చూసారు. మరోవైపు, మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ రాజు తెలిపారు.అయితే, పరిస్థితి కుదుట పడినప్పటికీ పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భైంసాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, రెచ్చగొట్టే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.