YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిధుల వరద (కర్నూలు)

నిధుల వరద (కర్నూలు)

నిధుల వరద (కర్నూలు)
కర్నూలు, జనవరి 20 : జిల్లాలోని పురపాలికలు, నగర పంచాయతీలకు నిధులు అందివచ్చాయి. ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం కింద పలు విడతలుగా నిధులు మంజూరు చేసి ప్రగతి పనులు చేపడుతోంది. 2017-18, 2018-19లో మంజూరైన పని ఆధారిత గ్రాంటుకు తోడు చివరి విడత 14వ ఆర్థిక నిధులు కర్నూలు కార్పొరేషన్‌ మినహాయిస్తే మిగిలిన పురపాలికలు, నగర పంచాయతీలకు మంజూరయ్యాయి.  14వ ఆర్థిక సంఘం కింద చివరి విడతలో బేసిక్‌ గ్రాంటు రూ.86.20 కోట్లు మంజూరయ్యాయి. పురపాలక అధికారులు ఈ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లభించింది. పురపాలికల పరిధిలో సర్కారు పాఠశాలలకు సంబంధించిన భవనాలకు మనబడి నాడు- నేడు కార్యక్రమం కింద మొదటి ప్రాధాన్యంగా కొంత నిధులను ఖర్చు చేయనున్నారు. ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల పురపాలికల్లో పాఠశాలల భవనాలు ఉండటంతో ఆ ప్రాంతాల్లో వాటికి ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. డోన్‌ పురపాలికతో పాటు ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, గూడూరు వంటి నగర పంచాయతీల్లో పాఠశాలలు లేవు. స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతులకు సంబంధించి కనీస సౌకర్యాలైన సీసీ రహదారులు, మురుగునీటి కాల్వలతో పాటు కల్వర్టులు, తదితర వాటిని పరిశీలించి అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుంది. నీటి సరఫరాకు సంబంధించి పైపులైన్‌ పనులు, విద్యుత్తు మోటార్లు వంటి వాటికి నిధులను వినియోగిస్తారు. ఏళ్ల నుంచి సిమెంటు దారులు, మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి ప్రధాన మురుగు కాలువలు, కల్వర్టులు వంటి పనులు చేపట్టాల్సి ఉంటోందని అధికారులు పేర్కొంటున్నారు. ఆదోని పురపాలికకు రూ.19.90 కోట్లు మంజూరయ్యాయి. మనబడి నాడు- నేడు కింద 11 పాఠశాలలకుగాను రూ.4.50 కోట్లు, నీటి సరఫరాకు సంబంధించి రూ.2 కోట్లు, మిగతా నిధులతో సీసీ రహదారులు, మురుగునీటి కాల్వల నిర్మాణాలకు కేటాయించనున్నారు.
డోన్‌ పురపాలిక సంఘంలో ఉద్యానవనాల కోసం రూ.కోటి, నీటి సరఫరా కోసం రూ.1.30 కోట్లు, మిగతా నిధులతో సీసీ రహదారులు, కాల్వల నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదించనున్నారు.
నంద్యాల పురపాలక సంఘానికి రూ.23.04 కోట్లు మంజూరు కాగా.. అమృత్‌ పథకం కింద చేపట్టిన పనులకు ఈ నిధులను సర్దుబాటు చేయనున్నట్లు తెలిసింది. పురపాలిక సంఘాల్లో చాలా ప్రాంతాల్లో మౌలిక వసతులు కొరవడ్డాయి. ప్రభుత్వం 2019-20 సంవత్సరానికిగాను 14వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసింది. వాటితో పట్టణాల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లభించింది. డోన్‌ పట్టణంలోని చాలా వీధుల్లో సిమెంటు దారులు, కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

Related Posts