ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 1,339 పరీక్ష కేంద్రాలు
హైద్రాబాద్, జనవరి 21
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి ఒకటి నుంచి మొదలుకానున్నాయి. ఇందుకు 1,507 కేంద్రాలు ఏర్పాటుచేశారు. 20 రోజులపాటు జరిగే ప్రాక్టికల్స్‌కు 3,34,557 మంది హాజరుకానున్నారు. పరీక్షలకు ఇంటర్‌బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. గత ఏడాదిలాగే ఈసారి కూడా నాలుగు అంకెల ఓటీపీసాయంతో పరీక్షల ప్రశ్నపత్రాలను అరగంట ముందు డౌన్‌లోడ్ చేసుకునే పద్ధతి కొనసాగిస్తున్నారు. ఆ బాధ్యతలు కాలేజీ ప్రిన్సిపాళ్లకు కల్పించినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. ప్రతిరోజు పరీక్ష పూర్తయిన గంటన్నరలోనే విద్యార్థుల మార్కులను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారని, దీనివల్ల అక్రమాలకు ఆస్కారం ఉండదని స్పష్టంచేశారు.మార్చి నాలుగు నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల కోసం 1,339 కేంద్రాలు, ఒకేషనల్ కోర్సుల కోసం 416 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇంటర్ ఫస్టీయర్ థియరీ పరీక్షలో జనరల్, ఒకేషనల్ కోర్సులకు కలిపి 4,80,516 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,85,324 విద్యార్థులు ఫీజులు చెల్లించినట్టు బోర్డు కార్యదర్శి తెలిపారు