YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎవరిష్టం వారిది..

ఎవరిష్టం వారిది..

ఎవరిష్టం వారిది..(అనంతపురం)
అనంతపురం, జనవరి 20 : కర్ణాటక ప్రాంతంలో తుంగభద్ర జలాలను ఇష్టారీతిన వాడేస్తున్నారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు వ్యతిరేకంగా అక్రమ వాడకానికి తెరలేపారు. తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పొడవునా ఎక్కడపడితే అక్కడ వాడేస్తున్నారు. ఇవన్నీ అనధికారికంగా పొందుతున్నవే. టీబీ జలాశయం నుంచి 0-105 కి.మీ. దాకా కర్ణాటకలోనే కాలువ ఉండగా.. ఆ పరిధిలోనే కాదు.. తుంగభద్ర జలాశయం ఎగువన కూడా అనధికారిక ఎత్తిపోతల పథకాలను నెలకొల్పారు. పరిశ్రమలు, తాగునీటి పథకాలు.. ఇలా వివిధ రూపాల్లో నీటిని వాడుతున్నారు. ఇప్పటి దాకా 13 టీఎంసీలు మేర అక్రమంగా వాడినట్లు సమాచారం. దీనిపై మన అధికారులు.. బోర్డు అధికారులకు లేఖాస్త్రం సంధించినా ఇప్పటి దాకా ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వాల స్థాయిలో రాజకీయ ఒత్తిడి పెంచితే తప్ప అక్రమ వాడకం తగ్గే అవకాశం కానరాలేదు. అక్రమ వాడకం లేకపోతే ఈదఫా మరో ఆరు టీఎంసీలు దాకా హెచ్చెల్సీకి వచ్చే వీలుండేది. ఇప్పుడు ఆ ఆరు టీఎంసీలు గండిపడినట్లే.  ఈ దఫా తుంగభద్ర జలాశయానికి 171 టీఎంసీలు లభ్యం అవుతాయని అంచనా వేశారు. ఇందులో హెచ్చెల్సీ వాటాగా 26.215 టీఎంసీలు కేటాయించారు. ఇప్పటి దాకా జలాశయం వద్ద 24.226 టీఎంసీలు, జిల్లా సరిహద్దుకు 21.803 టీఎంసీలు ప్రకారం చేరాయి. ఈనెలాఖరు దాకా నీరు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏటా ఆగస్టు నుంచి ఫిబ్రవరి దాకా ఏడు నెలలపాటు తుంగభద్ర జలాలను నిర్విఘ్నంగా వాడేస్తున్నారు. ఈ దఫా కూడా నిరుడు ఆగస్టులో హెచ్చెల్సీకి నీరు విడుదల చేశారు. ఆరంభం నుంచే అక్రమ తరలింపు సాగుతోంది. 42 ఎత్తిపోతల పథకాలు, ఆరు పెద్ద పరిశ్రమలు, గదగ్‌, కొప్పల్‌ జిల్లాల పరిధిలో తాగునీటి పథకాలు, కాలువపై వెయ్యికిపైగా అక్రమ పైపుల ఏర్పాటు.. ఇలా వివిధ రూపాల్లో నీటిని పొందుతున్నారు. ఖరీఫ్‌లోనే కాదు.. రబీలోనూ పూర్తి స్థాయిలో పంటలు పండిస్తున్నారు. కర్ణాటకకు కేటాయించిన నిర్దేశిత కోటా కంటే అదనంగా వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది నవంబరు 10, 20 తేదీల్లో తుంగభద్ర మండలి సమావేశం జరిగింది. ఎక్కడపడితే అక్కడ అడ్డంగా వాడుతున్నట్లు గుర్తించారు. కాలువలపై వేల పైపులు ఏర్పాటు, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగుకు వాడటం, తాగునీటి పథకాలు, నిర్దేశిత కేటాయింపు కంటే ఎక్కువ తీసుకోవడం.. వంటివి గుర్తించారు. సమగ్ర వివరాలతో ఎస్‌ఈ బోర్డుకు లేఖ పంపారు. 13 టీఎంసీలు దాకా వాడినట్లు అప్పట్లో లెక్క చూపారు. ప్రస్తుత సీజన్‌లో జరిగినట్లే ప్రతి ఏటా అక్రమ జలాల దోపిడీ సాగుతూనే ఉంది. ఇదే తరహాలో గతంలో ఆరుగురు ఇంజినీరు అధికారులతో కూడిన బృందాన్ని క్షేత్ర పరిశీలనకు పంపారు. 42 ఎత్తిపోతల పథకాలకు 11.619 టీఎంసీలు, తాగునీటికి 5 టీఎంసీలు, పరిశ్రమలకు 3.325 టీఎంసీలు, సింగటలూరు ఎత్తిపోతలకు 34.317 టీఎంసీలు, అక్రమ పైపుల ద్వారా 2 టీఎంసీల ప్రకారం మొత్తం 56.361 టీఎంసీలు వాడినట్లు నివేదికలో పేర్కొన్నారు. వాస్తవంగా వీటికి కేవలం 16 టీఎంసీలు మాత్రమే అనుమతి ఉంది. అక్రమంగా 40.361 టీఎంసీలు వాడారన్న మాట. ఇప్పుడు కూడా ఇంత కంటే ఎక్కువే వాడినట్లు తెలుస్తోంది. బోర్డు యంత్రాంగానికి పక్కాగా తెలిసినా ఎలాంటి కట్టడి చేయకపోవడం విచారకరం.

Related Posts