సూరత్ లో అగ్నిప్రమాదం
ఆహ్మాదాబాద్ జనవరి 21,
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలోని రఘువీర్ టెక్స్టైల్ మార్కెట్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రఘువీర్ టెక్స్టైల్ మార్కెట్లోని పది అంతస్తుల భవనంలో మంటలు రాజుకున్నాయి. వస్త్ర దుకాణాలున్న మార్కెట్ లో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక శాఖ అధికారులు దాదాపు 50 అగ్నిమాపక వాహనాలను రప్పించారు.సమీపంలోని హజీరా పారిశ్రామిక వాడలనుంచి కుడా అగ్నిమాపక శకటాలు వచ్చాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకశాఖ అధికారులు శ్రమించారు. అదృష్టవశాత్తు ప్రాణహని జరగలేదు. కానీ భారీ ఎత్తున వస్త్రాలు కాలిపోయినట్లు అనుమానిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం సూరత్ లోని ఒక ట్యూషన్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగి 22 మంది విద్యార్ధులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఘటన సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగారు.