YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

చంద్రబాబుకు బిజెపితో రాజకీయంగా చిక్కులు తప్పేలా లేవు

చంద్రబాబుకు బిజెపితో రాజకీయంగా చిక్కులు తప్పేలా లేవు

టీడీపీకి బిజెపితో ఉన్నా కష్టమే..వదిలినా కష్టమే!

బిజెపితో స్నేహం  టీడీపీకి నష్టం చేయనుందా?. గత ఎన్నికల్లో ఉపయోగపడిన మోడీ ఇమేజ్ ఈ సారి టీడీపీకి డ్యామేజ్ చేయనుందా?. టీడీపీ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ. ఇప్పటికిప్పుడు బిజెపికి గుడ్ బై చెప్పి బయటకు రావటానికి బలమైన కారణం ఏమీ టీడీపీకి కన్పించటం లేదు. అలా అని కలసి ముందుకు సాగితే రాజకీయంగా నష్టపోవటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బిజెపి స్వయంగా తెగతెంపులు చేసుకుంటుందా? అంటే కొంత కాలం పోతే కానీ ఈ విషయం తేలదు. గురువారం నాడు జాతీయ ఛానల్ రిపబ్లిక్ టీవీలో జరిగిన చర్చలో కొంత మంది బిజెపి ప్రతినిధులు నేరుగా చెప్పకపోయినా ఇదే సంకేతాలు ఇచ్చారు. బిజెపి టీడీపీతో పొత్తు వదులుకుంటుందా? అని పదే పదే ప్రశ్నించగా..దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటేసిన అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ కంటే ఒకింత బిజెపిపైనే ఎక్కువ కోపంతో ఉన్నారు. విభజన అంశాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోయి స్వయంగా కొత్త అధ్యాయానికి బాటలు వేసుకుంటున్నారు.రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ తోపాటు అంతే కారణమైన బిజెపి కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ వంటి వాటికి తుంగలో తొక్కింది. పోనీ ఏపీ సర్కారు హోదా బదులు ప్యాకేజీయే బెటర్ అని వాదించి..ఈ గండం నుంచి గట్టెక్కాలని  ప్రయత్నించినా ప్యాకేజీ కింద రాష్ట్రానికి వచ్చింది ఏమీ లేకపోవటంతో అధికార టీడీపీకి చుక్కలు కన్పిస్తున్నాయి.  ఇద్దరూ పాత పొత్తుతో ముందుకు వెళ్లి ప్రజలను ఏమని ఓట్లు అడుగుతారు?. హోదా..రైల్వే జోన్ వంటి అంశాలతోనే కాకుండా పోలవరం విషయంలోనూ కేంద్రం ఇబ్బందులు పెడుతుందని చంద్రబాబు ప్రచారం మొదలుపెట్టారు. మరి చివరి నిమిషం వరకూ ఉండి అప్పుడు బయటకు వచ్చినా..మిత్రపక్షంగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారనే విమర్శలను చంద్రబాబు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోనీ ఓ అరు నెలల ముందు ఇక లాభం లేదు అనుకుని బిజెపికి చంద్రబాబు రాం రాం అంటే కేంద్రంలో చక్రం తిప్పుతున్న మోడీ, అమిత్ షాలు చూస్తూ ఊరుకుంటారా?. చంద్రబాబు ఇమేజ్ అంత క్లీన్ గా ఉందా? అంటే అదీ లేదు. ఎటుచూసినా చంద్రబాబుకు బిజెపితో రాజకీయంగా చిక్కులు తప్పేలా లేవనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లోనే ఉంది.

Related Posts