చెరువులు మాయం (ఖమ్మం)
ఖమ్మం, జనవరి 21 భూగర్భ జల మట్టాలను మెరుగు పరచి తాగు, సాగునీటి అవసరాలు తీర్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చెరువులు.. ఆక్రమణల చెరలో చిక్కుకొని కనుమరుగవుతున్నాయి. భవిష్యత్తు తరాల ప్రయోజనాలు ఆశించి పూర్వీకులు నిర్మించిన నీటి వనరులు కబ్జాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల చుట్టూ ఉన్న చెరువులపై అక్రమార్కుల కన్నుపడుతోంది. అధికారాన్ని, పరపతిని అడ్డుపెట్టుకొని వీటిని ఆక్రమించి దర్జా వెలగబెడుతున్నారు. ఖమ్మం నగరపాలకం పరిధిలో రూ.కోట్ల విలువైన చెరువు శిఖం భూములు కొన్నింటిని ఆక్రమించేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువులను సంరక్షించేందుకు మిషన్ కాకతీయ పేరుతో ప్రతిష్ఠాత్మకంగా పథకాన్ని అమలు చేసింది. అయినా ఆక్రమణల నుంచి సంరక్షించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమవుతున్నారు. ఖమ్మం నగరంలో సుమారు 4 లక్షలకుపైగా జనాభా ఉంది. చెంతనే ప్రవహిస్తున్న మున్నేరు నుంచి, పాలేరు చెరువు నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు రక్షిత నీటి సరఫరా అందిస్తున్నారు. నగర పరిసరాల్లో ఉన్న చెరువుల ఆక్రమణల కారణంగా నీటి నిల్వ సామర్థ్యం ఏటేటా తగ్గిపోతోంది. వర్షాలు తక్కువగా ఉన్న ఏడాది వేసవిలో భూగర్భజల మట్టం పడిపోయి నగర ప్రజలు నీటికి ఇబ్బంది పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో నగర పరిసరాల్లోని రూ.వందల కోట్ల విలువైన చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఆక్రమణలతో పట్టా భూముల్లో ఉన్న వేముకుంట, అబ్బుకుంట, పటేల్‌కుంట, ధంసలాపురం చిన్న చెరువు మాయం అయ్యాయి. నగరానికి తలమానికంగా ఉన్న లకారం చెరువులో అక్రమ భూ కేటాయింపులు జరిగాయి. దానిని ఆసరాగా చేసుకుని చాలా దురాక్రమణ జరిగింది.
బల్లేపల్లి రాయని చెరువు ఆక్రమణ పాలయ్యింది. ఇష్టారీతిన పెద్ద గుంతలు పెడుతూ వేసవిలో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఖానాపురం ఊరచెరువు శిఖంలోనే జయనగర్ కాలనీలోని పలు నివాసాలు ఉన్నాయి. మిషన్ కాకతీయలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం(ఎఫ్‌టీఎల్) హద్దును గుర్తించినా ఆక్రమణలు తొలగించలేదు. ఈ చెరువుకు నీటిని అందించే, చెరువు నుంచి లకారం చెరువుకు నీటిని తరలించే కాలువలు శాశ్వత నివాసాల నిర్మాణాలతో కుచించుకుపోయాయి. ధంసలాపురం పెద్ద చెరువు శిఖంలో రాజకీయ పలుకుబడి కలిగిన వారు, కొందరు ఉన్నతాధికారులు ఆక్రమణదారులుగా ఉన్నారు. ఏటా చెరువు శిఖం పూడ్చి చదును చేస్తూ రూ.వందల కోట్ల విలువైన భూమి ఆక్రమిస్తున్నారు. ఈ చెరువు కింద నేటికీ వందలాది ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. వెలుగుమట్ల పెద్దచెరువు సైతం ఆక్రమణలో ఉంది. రహదారులు, సాగర్ కాల్వల కారణంగా చెరువుకు వచ్చే వరద తగ్గిపోయింది. ఈ చెరువును సాగర్ కాల్వ నీటితో నింపుతూ నగర శివారు, రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నారు. దీని కింద వందలాది ఎకరాల భూమి సాగులో ఉంది. మల్లెమడుగు పెద్ద చెరువులో 20 ఎకరాలకుపైగా ఆక్రమణకు గురయ్యింది. కైకొండాయిగూడెంలో 5 చెరువులు ఉన్నాయి. అన్నీ 20 ఎకరాల్లోపు ఆయకట్టు కలిగినవే. వీటిలో కోమటికుంట పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. రామన్నపేటలో ఉన్న ఊరచెరువు వివాదం న్యాయస్థానంలో ఉంది. గణేశ్‌కుంట సైతం వివాదంలో ఉంది. నగరంలోని పెద్ద చెరువుల్లో మిషన్ కాకతీయ పనులు చేపట్టారు. ఈ చెరువుల్లో ఆక్రమణల తొలగింపుపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. మునక పట్టాలను వినియోగించి అనేక మంది స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. ఆక్రమణలన్నీ తొలగించి పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్‌టీఎల్) హద్దులను పక్కాగా గుర్తిస్తే భవిష్యత్తులో నీటి కొరత ఉండదు.