ఫాస్ట్ గా లేదు(ఆదిలాబాద్)
ఆదిలాబాద్, జనవరి 21 : ప్రయాణికుల సౌకర్యార్థం జాతీయ రహదారులను ఆధునికీకరించారు. వాహనదారులకు ఇవి సౌకర్యంగా మారాయి. మెరుగైన దారుల్లో ప్రయాణించినందుకు టోల్‌ప్లాజాల ద్వారా రుసుము వసూలు చేస్తారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే నేపథ్యంలో డబ్బుల వసూలుకు ఫాస్టాగ్ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ఈ విధానం జిల్లాలోని గంజాల్ టోల్‌ప్లాజా వద్ద 40 రోజుల క్రితం ప్రారంభమైంది. ఇంకా ట్యాగ్ తీసుకోని వారు ఎక్కువగానే కనిపిస్తున్నారు. నగదు చెల్లిస్తూ ప్రయాణించే వాహనాలు బారులు తీరుతున్నాయి.. రానున్న రోజుల్లో పూర్తిగా ఒకే విధానం అమలు చేయనున్న తరుణంలో అందరూ ముందుగానే ‘ట్యాగ్’ను తీసుకోవడం మంచిది.. 2019 డిసెంబరు 1నుంచి జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారుల నుంచి టోల్‌ఛార్జీలు ఫాస్టాగ్ విధానంలో చెల్లింపులు అమల్లోకి తెచ్చారు. టోల్ వసూలుకు వాహనదారులు వేచి ఉండటంతో ఇంధనం, సమయం వృథా అయ్యేది. దీనిని నివారించేందుకు వాహనదారులకు ప్రయోజనాలు కల్పించేందుకు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) విధానంలో వసూలుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీని ద్వారా ఆగకుండా నేరుగా వెళ్లే అవకాశం ఉన్నందున సమయం, ఇంధనం కొంత కలిసొస్తుంది. వాహన చోదకులు ట్యాగ్‌లను తక్కువగా కొనుగోలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఇది వరకే గడువు పెంచింది. రానున్న రోజుల్లో రుసుము చెల్లించే లైను తీసివేసే ఆలోచనలో ఉంది. ఒక వేళ ఉన్నా టోల్ రుసుము రెట్టింపు చేసే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.44వ జాతీయ రహదారి నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ వద్ద టోల్‌ప్లాజా ఉంది. అక్కడ డబ్బుల వసూలుకు 12 బూత్‌లు ఉన్నాయి. అందులో ఎనిమిది పని చేస్తున్నాయి. ప్రస్తుతం నగదు చెల్లింపుకు ఒకే లైన్ ఉండటంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఫాస్టాగ్ ద్వారా ఆరు లైన్‌లలో(ఒక వైపు మూడు మరో వైపు మూడు) వాహనాలు వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. వాటిల్లోంచి ఆలస్యం లేకుండా వాహనాలు వెళుతున్నాయి. రెండు లైన్లు ఆటోలు, ద్విచక్ర వాహనాలు, వీఐపీలు వెళ్లడానికి కేటాయించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం జనవరి 15 నుంచి రెట్టింపు రుసుము తీసుకోవడానికి గడువు ముగుస్తుంది. అన్ని టోల్‌ప్లాజాల వద్ద, బ్యాంకుల్లో ట్యాగ్‌లను విక్రయిస్తున్నారు. వాహన ధ్రువపత్రం, ఆధార్‌కార్డు, వాహన యజమాని ఫొటో తీసుకొని విక్రయి కేంద్రాల్లో ట్యాగ్‌లను ఇస్తారు. కొన్నిచోట్ల చెల్లించిన నగదుకు సరిపడా ఫాస్టాగ్ బ్యాలెన్స్‌ను ఉచితంగా ఇస్తున్నారు