అనంతలో స్వైన్‌ఫ్లూ కలకలం..
అనంతపురం జనవరి 21
గతంలో ఎన్నడూలేని విధంగా డెంగీ విజృంభించి ప్రజలు, వైద్యులకు నిద్రలేకుండా చేసిన విషయం తెలిసిందే. తాజాగా చలితీవ్రత పెరగడం వల్ల స్వైన్‌ఫ్లూ తెరపైకి వచ్చింది. నగరంలోని రుద్రంపేటకు చెందిన 50 ఏళ్ల వ్యక్తికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన హైదరాబాద్‌కు వెళ్లి వచ్చారు. తరువాత జలుబు, తలనొప్పి ఎక్కువగా ఉండడంతో నగరంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే ఆయనకు న్యూమోనియా చికిత్స అందించారు. అయినా వ్యాధి తగ్గలేదు. దీంతో అనుమానం వచ్చి పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రిలోని ల్యాబ్‌కు పంపించారు. ఆ పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్ తెలిపారు. ఆస్పత్రిలోని ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డులో ఆ వ్యక్తిని ఉంచి వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ఆదివారం కూడా వెళ్లి అతడిని పరిశీలించామని, ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం సంతృప్తికరంగా ఉందని డీఎంహెచ్‌ఓ తెలిపారు. అలాగే అనుమానంతో మరో ముగ్గురిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపామన్నారు, మొత్తమ్మీద మళ్లీ స్వైన్‌ప్లూ వ్యాధి నిర్ధారణ కావడంతో ఇటు జనం.. అటు వైద్యులు ఆందోళన చెందుతున్నారు
స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులే నిర్ధరిస్తున్నా ప్రత్యేక దృష్టి సారించలేదు. కొందరు వైద్యులు నిర్లక్ష్యం చూపిస్తున్నారు. అనంతపురం నగరంలో పాతూరుకు చెందిన ఓ మహిళకు (28) ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు తేలింది. కానీ.. సదరు మహిళకు ఛాతీ వైద్య చికిత్స నిపుణుడు కేవలం ఫ్లూ మాత్రలు ఇచ్చి పంపించారు. కనీసం నమూనా కూడా తీయలేదు. జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రి నుంచి రెండు నమూనాలు, ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరొక రోగికి నమూనాలు తీశారు. ఈ ఫలితాలు ఏమయ్యాయో బయటకు చెప్పడం లేదు. అసలు రోగులు ఆస్పత్రుల్లో ఉన్నారా లేదా అనే వివరాలను ఆరోగ్య శాఖకు పంపడం లేదు. ఈ నలుగురి శాంపిళ్లు వైద్య కళాశాలకు పంపారు..
ప్రతి ఏటా మరణాలు...
జిల్లాలో ఏటా చలి కాలంలో ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. 2015లో ప్రప్రథమంగా తెరపైకి వచ్చింది. అప్పట్లో 16 మందికి సోకింది. మరో నలుగురు మృత్యువాత పడ్డారు. 2016లో ఇద్దరికి సోకిగా.. ఇంకో ఇద్దరు మరణించారు. 2017లో 9 మందికి ప్రబలగా.. ఒకరు మృతి. 2018లో 16 మందికి సోకగా వైద్య చికిత్సతో నయం అయింది. ఒకరు మాత్రం చనిపోయారు. గతేడాదిలోనూ 16 మందికి సోకగా.. ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంవత్సరంలో ఒకరికి బయట పడింది. మరో నలుగురికి అనుమానిత లక్షణాలు ఉన్నట్లు తేలింది.ఈ ఫ్లూ మహమ్మారి నివారణకు మందులు పుష్కలంగా ఉన్నాయి. మాత్రలు, సిరప్‌లు ఇప్పటికే నిల్వ ఉంచారు. ఆరోగ్య శాఖకు సరఫరా అయిన మందులను అనంత సర్వజన ఆస్పత్రి, హిందూపురం, కదిరి, గుంతకల్లు వంటి ఆస్పత్రుల్లో నిల్వ చేశారు. ఈ విషయాన్ని డీఎంహెచ్‌వో డాక్టర్ అనిల్‌కుమార్ ‘న్యూస్‌టుడే’కు తెలియజేశారు. ఆస్పత్రిలో ఒక వృద్ధుడు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఎన్95 మాస్క్‌లు పది వేలు వచ్చాయి. వీటిని అన్ని ఆస్పత్రుల్లోనూ సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. స్వైన్ ఫ్లూ సోకడానికి ఇదే అదను. అందుకే అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు.