పాఠశాల ఆవరణలో కుక్కకు ఇల్లు
మహబూబ్ నగర్, జనవరి 21
పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కుక్కకు ఇల్లు కట్టించిన ఘటన ఆశ్చర్యం గొలుపుతోంది. అయితే, ఓ ప్రైవేటు పాఠశాలలో కుక్కకు ఇల్లు కట్టించడం అంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే, పాఠశాల యజమాని తన ఇష్టానుసారం స్కూలును నడిపించవచ్చు. కానీ, తాజా ఘటన ప్రభుత్వ పాఠశాలలో జరగడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది.నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ స్కూలు క్యాంపస్‌లో కుక్కకు ఇల్లు కట్టించారు. తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ నాగమణి.. పిల్లల వద్ద ఫైన్ రూపంలో వసూలు చేసిన డబ్బులతో దీని నిర్మాణం చేయించారు.అయితే, ఈ కుక్క తన పెంపుడు శునకమని గ్రామస్థులు అంటున్నారు. తన కుక్కకు పాఠశాల ఆవరణలో ఇల్లు కట్టించింది. తాను పెంచుకొనే కుక్కలను చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చేసేది లేక, తాను పని చేస్తున్న పాఠశాలలోనే కుక్కకు ఇల్లు కట్టించాలని ప్రిన్సిపాల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.సంక్రాంతికి ఇళ్లకు వెళ్లిన పిల్లలు సాధారణంగా సెలవులు ముగియగానే మళ్లీ పాఠశాలకు రారు. అప్పుడే తరగతులు నిర్వహించరని రెండు మూడు రోజులు ఆలస్యంగా వస్తుంటారు. ఇలా ఒకటి రెండు రోజులు ఆలస్యంగా వచ్చినందుకు, పిల్లల నుంచి జరిమానాలు వసూలు చేశారు. ఫైన్లు వసూలు చేసిన డబ్బుతో తన కుక్కకు స్కూల్‌లోనే షెడ్డు కట్టించారు.. ప్రిన్సిపాల్. ఈ పాఠశాలలో జరిగిన ఘటనను బాలల హక్కుల సంఘం అధికారుల దృష్టికి తెచ్చింది.