16 ఎర్ర చందనం దుంగలతో నలుగురు స్థానిక స్మగ్లర్లు అరెస్టు: ఒకరు తిరుపతి వాసి
తిరుపతి జనవరి 21
తిరుపతి సమీపంలో ని పాపానాయుడు అటవీ ప్రాంతంలో 16 ఎర్ర చందనం దుంగలతో పాటు, వాటిని చేరవేస్తున్న నలుగురు స్థానిక స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన తిరుపతి సమీపంలో ని పాపానాయుడుపేట అటవీ పరిధిలోని ముసిలిపేడు వద్ద మంగళవారం ఉదయం జరిగింది. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి శ్రీ పి రవిశంకర్ గారికి అందిన సమాచారం మేరకు ఆయన ఆదేశానుసారం, ఆర్ ఎస్ ఐలు లింగాధర్, వాసు ఎస్బీఒ కోదండన్ ల బృందం ఏర్పేడు వద్ద నుంచి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ముసిలిపేడు వద్ద నలుగురు స్మగ్లర్లు ఎర్ర దుంగలను చేరవేస్తూ కనిపించారు. వెంటనే లింగాధర్ టీమ్ వారిని చుట్టు ముట్టారు. పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ, నలుగురిని పట్టుకో గలిగారు. వారిలో ఒకడు తిరుపతి కి చెందిన పాముల రాజేంద్ర (46), మిగిలిన ముగ్గురు ముసిలిపేడుకు చెందిన తుపాకుల మురళి (28), అజ్జూరి సురేష్ (20), గాజుల మురుగేష్ (17)లుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరి నుంచి 16 ఎర్ర చందనం దుంగలను, హీరో మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరి నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్పీ వెంకటయ్య సూచనల తో సీఐ సుబ్రమణ్యం, ఎస్ ఐ చంద్రశేఖర్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు