అనంతపురం ఆస్పత్రిలో నిర్లక్ష్యం
అనంతపురం, జనవరి 22,
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఇంకా కొందరు వైద్యుల్లో నిర్లక్ష్యం వీడలేదు. వీరి బాధ్యతారాహిత్యం.. నిండు ప్రాణాలపై ప్రభావం చూపుతోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతేడాది తాడిపత్రికి చెందిన అక్తార్‌భాను అనే బాలింతకు రక్తమార్పిడి చేసి నిండు ప్రాణాన్ని తీసిన విషయ విధితమే. దీనిపై ప్రభుత్వం స్పందించి అందుకు బాధ్యులైన వైద్యులను సస్పెండ్ చేసింది. అయినా కూడా చాలా మంది వైద్యుల్లో ఎలాంటి మార్పు రావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఆస్పత్రిలో ఓ ఖైదీ సర్జరీ విషయంలో అనస్తీషియా విభాగం వైఫల్యం ఉన్నట్లు తెలిసింది.ఈ నెల 12న ఓ ఖైదీ ఆస్పత్రిలో అడ్మిషన్ అయ్యాడు. ఖైదీని పరీక్షించిన వైద్యులు లాపొరాక్టమీ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13న సర్జన్లు ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో సర్జరీ చేశారు. అంతకంటే ముందు ఓ అనస్తీషియా వైద్యురాలు.. అనస్తీషియా విభాగం హెచ్‌ఓడీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనస్తీషియా ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవంగా ఖైదీకి సర్జరీ చేసే సమయంలో కచ్చితంగా సంబంధిత హెచ్‌ఓడీ పర్యవేక్షణలో అనస్తీషియా ఇవ్వాల్సి ఉందని ఆస్పత్రి వర్గాల చెబుతున్నాయి. సర్జరీ జరిగిన కాసేపటికే ఖైదీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్యులు అప్రమత్తమై ఆంబు బ్యాగ్, ఆక్సిజన్ సిలిండర్ ద్వారా శ్వాసను అందించి అక్యూట్ మెడికల్ కేర్‌కు తరలించారు.వెంటిలేటర్ ద్వారానే వైద్యం అందించారు. మొదట స్పైన్‌కు అనస్తీషియా ఇవ్వడం ద్వారానే ఈ సమస్య ఏర్పడినట్లు సమాచారం. అన్నీ అయ్యాక ఈ విషయాన్ని హెచ్‌ఓడీ దృష్టికి తీసుకెళ్లాగా హెచ్‌ఓడీ తీవ్ర స్థాయిలో సంబంధిత వైద్యురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏమైనా జరిగితే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని బహిరంగంగానే చెప్పినట్లు సమాచారం. ఖైదీ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి విషమించడంతో శుక్రవారం ట్రెకాష్టమీ చేసినట్లు తెలిసింది. ఇదే రోజున ఖైదీకి ఎంఆర్‌ఐ చేశారు. ఆస్పత్రిలో ఈ అంశం పెద్దచర్చనీయాంశమవడంతో రోజూ ముగ్గురు అనస్తీషియా వైద్యులు ప్రత్యేకంగా ఖైదీని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సర్జరీ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. దీనిపై లోతుగా విచారణ చేపడుతామని తెలిపారు. అనస్తీషియా హెచ్‌ఓడీ నవీన్‌కుమార్ తనకు ఖైదీ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని, సర్జరీ పూర్తయ్యాకే వైద్యురాలు తనకు దృష్టికి తీసుకొచ్చారని సమాధానమిచ్చారు.