మేడారం భక్తులకు శఠగోపం..బెల్లం వ్యాపారులు ‘సిండికేట్’
లారీకి రూ.1.70 లక్షల లాభం
వరంగల్ జనవరి 22
సమ్కక్క – సారలమ్మ జాతరకు వెళ్లేందుకు భక్తులు ఓ వైపు సిద్ధం అవుతున్నారు. తల్లులకు సమర్పించేందుకు బంగారం (బెల్లం) కొనుగోలు చేసే యత్నాల్లో ఉన్న భక్తులను నిలువు దోపిడీ చేసేందుకు బెల్లం వ్యాపారులు ‘సిండికేట్’ అవుతున్నారు. మేడారం వెళ్లకముందే భక్తులకు శఠగోపం పెట్టేందుకు సిండికేట్‌గా ఏర్పడిన తొమ్మిది మంది వ్యాపారులు.. తమకు ఓ ఎక్సైజ్ «అధికారి అండ ఉందని బహిరంగంగానే చెబుతుండడం వ్యాపారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రతిసారి వరంగల్ బీట్‌బజార్ కేంద్రంగా సుమారు 150 నుంచి 200 లారీల బెల్లం విక్రయాలు జరుగుతాయి. ఇదే అదునుగా భావించిన కొందరు అధికారులు, వ్యాపారులుమిలాఖత్ అయి ఈసారి పెద్ద మొత్తంలో ధరలు పెంచేందుకు సిద్ధం కావడం వివాదస్పదమవుతోంది.మహారాష్ట్రలోని పూణెతో పాటు నాందేడ్ తదితర ప్రాంతాల నుంచి వరంగల్ బీట్‌బజార్‌కు బెల్లం దిగుమతి అవుతుంది. 10 టైర్ల లారీ నుంచి 16 టైర్ల లారీ వరకు ఒక్కో లారీలో 17(17వేల కిలోలు) టన్నుల నుంచి 22(22వేల కిలోలు) టన్నులు తీసుకొస్తారు. ఇందుకోసం వ్యాపారులు డీడీ చెల్లిస్తే రవాణా చార్జీలతో సహా రూ.33కు కిలో చొప్పున దిగుమతి చేస్తారు. 17 టన్నుల్లో కిలోకు రూ.33 చొప్పున ఖరీదు చేస్తే పెట్టుబడిగా రూ.5,61,000 వెచ్చించాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈ బెల్లాన్ని కిలోకు రూ.10 పెంచి అమ్మినా రూ.7,31,000 వస్తాయి. అంటే ఒక్క 17 టన్నుల లారీపై రూ.1.70లక్షలు, 22 టన్నులపై రూ.2.20లక్షల లాభం వస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అమ్మింది పోను ఇంకా సుమారు 150 లారీల (17 టన్నుల) బెల్లం విక్రయించే అవకాశం ఉందని వ్యాపారులే చెబుతున్నారు. అంటే కిలోకు రూ.10లు పెంచి (రూ.43కు కిలో) అమ్మినా రూ.2.25 కోట్ల లాభం వ్యాపారులకు అందుతుంది. కానీ ఇప్పటికే హోల్‌సేల్‌గా కిలోకు రూ.43 వరకు విక్రయిస్తుండగా.. బుధవారం నుంచి సిండికేట్‌గా మారి ధర పెంచితే ఎన్ని రూ.కోట్ల ఆదాయం వస్తుందో అంచనా వేయొచ్చని కొందరు వ్యాపారులే చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని బెల్లం ధరలు పెంచకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.