సిటీలో మల్టీ పార్కింగ్ దిశగా అడుగులు
హైద్రాబాద్, జనవరి 23,
మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న అక్రమ పార్కింగ్‌కు చెక్ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ నడుం భిగించింది. నగరంలోని మెయిన్ రోడ్లకిరువైపులా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి, వాటిల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఓ దఫా అధికారులతో సమావేశం నిర్వహించిన బల్దియా కమిషనర్ మంగళవారం మరోసారి మల్టీలేవెల్ పార్కింగ్ వ్యవస్థకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనపై కూలంకుశంగా చర్చించారు. మల్టీ లెవెల్ పార్కింగ్‌కు స్థలాలిచ్చే యజమానుల రక్షణతో పాటు ఆర్థికంగా లబ్ది చేకూర్చే విధంగా నిబంధనలను రూపొందించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన యాప్, టెక్నాలజీని యజమానులకు పరిచయం చేయటం, టెక్నాలజీ ఇచ్చిన సంస్థకు, స్థలాలిచ్చిన యజమానులకు మధ్య సమన్వయకర్తగా మాత్రమే బల్దియా వ్యవహారించేలా ఈ మార్గదర్శకాలను తయారు చేయాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాణిజ్య ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో మల్టీలేవెల్ పార్కింగ్ ఏర్పాటుకై రూపొందిస్తున్న సమగ్ర ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వానికి పంపనున్నట్లు కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ఈ పార్కింగ్ వ్యవస్థతో రెవెన్యూ పెంచుకోవాలని జీహెచ్‌ఎంసీ భావించటం లేదని, నగరంలో పార్కింగ్ సమస్య పరిష్కారమయ్యేలా, వాహనదారులకు ఓ పద్దతి ప్రకారం తమ వాహానాలను పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించటంతో పాటు స్థలాలిచ్చిన యజమానులకు ఆదాయం సమకూరేలా చూడటమే జీహెచ్‌ఎంసీ ప్రధాన లక్ష్యంగా ఈ గైడ్‌లైన్స్ ఉంటాయని కమిషనర్ వివరించారు. ముఖ్యంగా ఈ మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థలో ఆదాయం టెక్నాలజీ ఇచ్చే సంస్థకు, స్థలాలిచ్చిన యజమానులకు కల్గించటంతో పాటు గైడ్‌లైన్స్‌ను కట్టుదిట్టంగా అమలు చేయటమే ముఖ్యమైన విధిగా జీహెచ్‌ఎంసీ పాత్ర పోషించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ పార్కింగ్ వ్యవస్థను ఎంప్యానల్ ఏజెన్సీకి అప్పగించే యోచన ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవస్థ కింద నిర్మించే పార్కింగ్ నిర్మాణాలు తాత్కాలిక పద్దతిలో ఉంటాయని ఆయన వివరించారు. భూమి ఇచ్చిన యజమానులు కోరుకున్నపుడు వీటిని తొలగించేలా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ పార్కింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా రోడ్లపై వాహానాలను రద్దీని, రోడ్లకిరువైపులా అక్రమ పార్కింగ్‌ను తగ్గించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ పార్కింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ప్రత్యేక యాప్‌ను వాహనదారులకు అందుబాటులోకి తెచ్చి, వారు ప్రయాణిస్తున్న ఏరియాల్లో సమీపంలోని మల్టీలేవెల్ పార్కింగ్ ఎక్కడ అందుబాటులో ఉందన్న విషయం వారికి సెల్‌ఫోన్లలో తెలుస్తోందని, వారికి కావల్సిన చోట వారు పార్కింగ్‌ను బుక్ చేసుకుని వాహానాలను పార్కింగ్ చేసుకునే అవకాశం వుందన్నారు.